Intermediate Results 2025: ఇంటర్‌లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:09 AM
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అద్భుతంగా రాణించగా, బాలికలు బాలుర కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు

ద్వితీయ సంవత్సరంలో 83 శాతం మంది
ప్రథమ సంవత్సరంలో 70% మంది పాస్
గత పదేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే అత్యధికం
టాప్‌లో కృష్ణా... అట్టడుగున అల్లూరి జిల్లా
రెండు సంవత్సరాల్లోనూ బాలికలదే పైచేయి
సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. రెండో సంవత్సరం 83శాతం, మొదటి సంవత్సరం 70శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను మంత్రి లోకేశ్ శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదే నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. రెండు సంవత్సరాల్లోనూ బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించి సత్తా చాటుకున్నారు. ద్వితీయ సంవత్సరంలో 80శాతం మంది బాలురు, బాలికలు 84శాతం, ప్రథమ సంవత్సరంలో బాలురు 66శాతం, బాలికలు 75శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గ్రూపుల వారీగానూ ఈసారి ఉత్తమ ఫలితాలే వచ్చాయి. జిల్లాల వారీగా సెకండ్ ఇయర్ ఫలితాల్లో 93శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గుంటూరు (91ు), ఎన్టీఆర్ (89%) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మొదటి సంవత్సరం ఫలితాల్లో కూడా తొలి మూడుస్థానాల్లో వరుసగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలే ఉండటం విశేషం. ఇక సెకండ్ ఇయర్‌లో 73శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఫస్ట్ ఇయర్‌లో 54 శాతంతో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ ఒకేషనల్ ఫస్ట్ ఇయర్‌లో 62శాతం, సెకండ్ ఇయర్‌లో అత్యధికంగా 77శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా అన్ని యాజమాన్యాల కాలేజీల్లోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది.
విద్యార్థులకు సీఎం అభినందనలు
ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఉత్తీర్ణతలో అద్భుతమైన మెరుగుదల కనిపించడం ఆనందంగా ఉందన్నారు. తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు, కేర్‌టేకర్ సిస్టమ్ వంటి గేమ్ ఛేంజింగ్ సంస్కరణలను విద్యారంగంలో తీసుకురావడం వల్లే విద్యార్థులు అద్బుతాలు ఫలితాలు సాధించారని చంద్రబాబు పేర్కొన్నారు.
మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అలాగే అవే తేదీల్లో విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు కూడా హాజరుకావచ్చని పేర్కొంది. ఈ నెల 15 నుంచి 22లోగా సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా పేర్కొది. అలాగే ఈ నెల 13 నుంచి 22 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల సత్తా
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. గత దశాబ్దకాలంలో ఎన్నడూలేని విధంగా ఉత్తమ గణాంకాలు నమోదయ్యాయి. ఫస్టియర్ పరీక్షలకు 50,314 మంది హాజరవగా 23,799 మంది(47ు) పాస్ అయ్యారు. అలాగే రెండో సంవత్సరంలో 39,783 మందికి గాను 27,276 మంది(69%) ఉత్తీర్ణులయ్యారు. 2014 నుంచి పరిశీలిస్తే ప్రభుత్వ కాలేజీలకు ఇవే అత్యుత్తమ గణాంకాలు. 2024లో ఫస్టియర్‌లో కేవలం 38శాతం మంది, సెకండియర్‌లో 58శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదం చేశాయి. ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తోంది. మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించింది. 217 కాలేజీలకు ప్రిన్సిపాళ్లను నియమించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా ఏ,బీ,సీ కేటగిరీలుగా వర్గీకరించి వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ చర్యలతో ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. ఈ విభాగంలో రెండో సంవత్సరంలో పార్వతీపురం మన్యం (81%), గుంటూరు(76%), అన్నమయ్య (76%)తో టాప్‌లో ఉండగా... విశాఖపట్నం(55%), అనకాపల్లి (61%), బాపట్ల(63%) అట్టడుగున ఉన్నాయి.
మంత్రి లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జూనియర్ కాలేజీలపై సమీక్షించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు బ్యాగులు, నోట్‌బుక్స్ కూడా ఇచ్చారు. దీంతో అడ్మిషన్లు కూడా పెరిగాయి. 15వేల మంది అదనంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది.
ఫెయిలైనవారు నిరాశ పడొద్దు
ఇంటర్ ఫలితాలపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఇంటర్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో మెరుగుదల కనిపించింది. ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండి. దీనిని ఒక అడుగుగా భావించి మరింత కృషి చేసి మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
అన్ని సబ్జెక్టుల్లో 98 శాతం.. ఇంగ్లీషులో 5 మార్కులే..!
ఇంటర్ మొదటి సంవత్సరంలో 98 శాతం మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం సంస్కృతం (98), మ్యాథ్స్ 2ఏ (73), మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ 100 శాతం మార్కులొచ్చాయి. కానీ.. సెకండియర్ ఇంగ్లీషులో మాత్రం 5 మార్కులే వచ్చాయి. దీంతో ఆ విద్యార్థిని ఫెయిల్ అయింది. విజయవాడ పటమటకు చెందిన దండే రాజేశ్వరి.. నారాయణ ఏసీఈసీ క్యాంప్‌సలో ఇంటర్ చదివింది. ఫస్టియర్‌లో ఆమెకు 98 శాతం మార్కులు వచ్చాయి. ఇంగ్లీషులో 94 మార్కులు సాధించింది. సంస్కృతంలో 99, గణితం 1(ఎ)లో 75, 1(బీ)లో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 58 మార్కులు సాధించింది. కానీ.. సెకండియర్‌లో సంస్కృతంలో 98, గణితం 2(ఎ)లో 73, 2(బి)లో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. ఇంగ్లీషులో మాత్రం ఐదు మార్కులే వచ్చినట్టు చూపించింది. దీంతో మొత్తం 892 మార్కులు సాధించినప్పటికీ ఆమె ఫెయిల్ అయింది. బాగా చదివే ఆమెకు ఇంగ్లీషులో ఐదు మార్కులే రావడంతో కన్నీరుమున్నీరవుతోంది.