Heavy Rains: రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:06 PM
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
విశాఖపట్నం, ఆగస్ట్ 14: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఇది మరింత బలపడి సుస్పష్ట అల్ప పీడనంగా మారే అవకాశముందన్నారు. విశాఖపట్నంలో ఆయన ఇవాళ(గురువారం) విలేకర్లతో మాట్లాడుతూ.. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కొనసాగుతోందన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర - ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని తెలిపారు. రాగల వారం రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆయన సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని వివరించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితి..
విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుత ఇన్, ఔట్ ఫ్లో 5,52,640 క్యూసెక్కులుగా ఉంది. మరి కాసేపట్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే కృష్ణానదికి వరద పోటు ఎత్తడంతో.. ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఏ సమయంలోనైనా.. అత్యవసర సహాయం కోసం 112, 1070 నెంబర్లను సంప్రదించాలని కోరింది. ఇక కృష్ణానదిలో ప్రయాణించడం కానీ.. ఈతకు వెళ్లడం.. చేపలు పట్టడం వంటి పనులు చేయవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటన వెలువరించారు.
శ్రీశైలం జలాశయం వద్ద పరిస్థితి
మరోవైపు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమంగా తగ్గుతోంది. జలాశయం 5వ రేడియల్ క్రస్ట్ గేట్ 10 అడుగులు మేర ఎత్తివేశారు. నదిలో ఇన్ ఫ్లో 77,965 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,99,122 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 198.81 టీఎంసీలు ఉన్నాయి. మరోవైపు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.