Pinnelli Brothers Bail Petition: పిన్నెల్లి బ్రదర్స్‌కి బిగ్ షాక్..
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:48 AM
పిన్నెల్లి సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు...
అమరావతి, ఆగస్టు 29: పిన్నెల్లి సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. కొట్టివేసింది. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నాడు.
అసలేం జరిగింది..
పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ లీడర్స్ జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. వీరి హత్యలో పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలడంతో.. కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో పిన్నెల్లి బ్రదర్స్ సహా హత్యతో ప్రమేయం ఉన్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు.
అయితే, టీడీపీ నాయకులు జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర్లు హత్యలో పిన్నెల్లి బ్రదర్స్ ప్రమేయం ఉందని.. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫను ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. బాధితులను హత్య చేసేందుకు పక్కా పథకం వేశారని.. ఇందుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ సేకరించామని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులనీ.. వారికి బెయిల్ ఇస్తే కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆగస్టు 21న ఈ కేసులో విచారణ జరుగగా.. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును ఆగస్టు 29కి వాయిదా వేసింది. ఆ మేరకు నేడు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.