Turaka Kishore Arrest: అప్పటి ఘటనల్లో ఇప్పుడు అరెస్టా
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:25 AM
రెండు, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించి వైసీపీ నేత తురకా కిశోర్ పై ఇప్పుడు ఫిర్యాదులు అందుకొని
అంత అవసరం ఏమొచ్చింది?
తురకా కిశోర్ కేసులో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
కళ్లు మూసుకొని రిమాండ్ విధించారు
మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులపై ఆక్షేపణ
అమరావతి, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): రెండు, మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించి వైసీపీ నేత తురకా కిశోర్ పై ఇప్పుడు ఫిర్యాదులు అందుకొని, అంత అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అరెస్ట్ సమయంలో పోలీసులు చట్టనిబంధనలు పాటించనప్పటికీ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. మెజిస్ట్రేట్ కళ్లు మూసుకొని రిమండ్ విధించారని పేర్కొంది. వారికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం తమ తప్పేనని వ్యాఖ్యానించింది. తురకా కిశోర్‌ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు చట్టనిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు దస్త్రాలు అందజేయడంతో, అవి తమకు ఇవ్వలేదని సహాయ ప్రభుత్వం న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దస్త్రాలు అందజేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రయత్నించగా, రిజిస్ట్రీ ముందు దాఖలు చేసేలా ఆదేశించాలని సహాయ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పేపర్లు అందుకోకుండా పదేపదే అదే విషయాన్ని చెప్పడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తమ ముందు దస్త్రాలను తీసుకోవడానికి నిరాకరించడం ఏంటని ప్రశ్నించింది. హైకోర్టులో అందునా ద్విసభ్య ధర్మాసనం ముందు నడుచుకొనేది ఇలాగేనా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో రికార్డు చేసింది. రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను కోర్టు ముందుకు పిలిపించింది. పిటిషనర్ అందజేసే దస్త్రాలను సీల్డ్ కవర్‌లో ఉంచి తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని ఆయనను ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరుజిల్లా జైలు నుండి విడుదలైన తన భర్త తురకా కిశోర్‌ను పల్నాడుజిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త పై 12 కేసులు పెట్టారని, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...తురకా కిశోర్ పై ఎన్ని కేసులు నమోదయ్యాయో వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించగా, సహాయ ప్రభుత్వ న్యాయవాది కేసు వివరాలు కోర్టు ముందు ఉంచారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.రామలక్ష్మణ్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News