Share News

High Court: గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:40 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీని ఆనుకొని ఉన్న అటవీ, ఇరిగేషన్‌ భూముల్లో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారంటూ ..

High Court: గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వండి

  • తిరుపతి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీని ఆనుకొని ఉన్న అటవీ, ఇరిగేషన్‌ భూముల్లో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. అక్కడ అక్రమంగా మైనింగ్‌ జరుగుతోందా? ఇరిగేషన్‌ కాలువలో పూడికతీత వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ యాజమాన్యం నీటివనరులను పూడ్చివేస్తోందని పేర్కొంటూ తిరుపతి జిల్లాకు చెందిన మద్రాసుబాబు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అక్రమమైనింగ్‌ను నిలువరించడంతో పాటు నీటి వనరులను పునరుద్ధరించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. పిల్‌ బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాది సోమరాజు వాదనలు వినిపిస్తూ.. కాలువలో పూడికతీతకు ఐఐఐటీకి అనుమతులు ఇచ్చామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 03:40 AM