AP High Court: మార్గాని భరత్‌ను అరెస్టు చేయొద్దు
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:11 AM
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పోలీసు దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన అనంతరం క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. కేసు దర్యాప్తుదశలో ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఫిర్యాదుదారుడు చాపలరాజుకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతిష్ఠను దిగజార్చేలా, హిందువులను మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టానని ఆరోపిస్తూ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు.