AP High Court order: ఆ విగ్రహాలను 4 వారాలపాటు ప్రారంభించవద్దు
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:40 AM
డాక్టర్ వైఎ్‌సఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రైతు దంపతుల విగ్రహాలను నాలుగు వారాల వరకు ప్రారంభించవద్దని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది...
పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి.. హార్టికల్చరల్ వర్సిటీ అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): డాక్టర్ వైఎ్‌సఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రైతు దంపతుల విగ్రహాలను నాలుగు వారాల వరకు ప్రారంభించవద్దని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. డాక్టర్ వైఎ్‌సఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ధ్యానముద్రలో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకోవడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహం ఏర్పాటుకు అధికారులు తన వద్ద నుండి రూ.4 లక్షలు డొనేషన్ స్వీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గురువారం వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపించారు. వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయం తీర్మానం చేసిందన్నారు. శిల్పికి యూనివర్సిటీ నుండి అడ్వాన్స్ కూడా ఇచ్చారన్నారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహం స్థానంలో మరో రెండు విగ్రహాలు ఏర్పాటు చేశారని, ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్సిటీ తరఫు స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. అందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలో తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ... యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన విగ్రహాలను నాలుగు వారాలపాటు ప్రారంభించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..