Share News

Kadapa Land Dispute: సజ్జల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - May 30 , 2025 | 04:09 AM

సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల 63.72 ఎకరాల భూమి విషయంలో హైకోర్టు కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేసి, భూమి యథాతథంగా ఉండాలని ఆదేశించింది. విచారణను జూన్ 30వ తారీఖుకి వాయిదా వేసింది.

 Kadapa Land Dispute: సజ్జల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట

  • 63.72 ఎకరాలపై యథాతథ స్థితి

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. కడప జిల్లా సీకే దిన్నె మండలం పరిధిలోని పలు సర్వే నంబర్లలో 63.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై న్యాయస్థానం స్టే విధించింది. కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చేనాటికి ఉన్న స్థితిని యఽథాతథంగా కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసింది. విచారణను జూన్‌ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సీకే దిన్నె మండల పరిధిలోని పలు సర్వే నంబర్లలో రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌లు, వారసత్వంగా తమకు సంక్రమించిన 63.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్‌రెడ్డి సతీమణి భగీరథి, కుమారుడు సందీ్‌పరెడ్డి, మరో సోదరుడు జనార్దన్‌రెడ్డి, సతీమణి విజయకుమారి, దివాకర్‌రెడ్డి అల్లుడు సత్య సందీ్‌పరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ మండల పరిధిలో తమకున్న 201.17ఎకరాల భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఆ భూములు దశాబ్దాలుగా తమ స్వాధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ప్రణతి స్పందిస్తూ.. భూమిని ఇప్పటికే స్వాధీ నం చేసుకున్నామని, పూర్తి వివరాలతో మెమో దాఖలు చేశామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చేనాటికి ఉన్న స్థితిని యఽథాతథంగా కొనసాగించాలని ఆదేశించారు.

Updated Date - May 30 , 2025 | 04:11 AM