High Court: ఐపీఎస్‌ల క్వాష్ పిటిషన్లపై 18లోగా కౌంటర్
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:26 AM
ముంబై మోడల్/సినీ నటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు పీఎ్‌సఆర్ ఆంజనేయులు..
జెత్వానీ కేసులో రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ 21కి వాయిదా
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ముంబై మోడల్/సినీ నటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు పీసీఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, అప్పటి ఏసీపీ కె.హనుమంతరావు, దర్యాప్తు అధికారి కె.సత్యనారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై జూలై 18కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను వేధించారని జెత్వానీ కంప్లయింట్ ఇవ్వడంతో పై పోలీసు అధికారులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పీఎ్‌సఆర్, కాంతిరాణా, గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. కేసు ఆధారంగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు.
ఈ కేసు కారణంగా పిటిషనర్లు సస్పెన్షన్‌లో ఉన్నారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. కేసు ఆధారంగా పిటిషనర్లపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నాయని గుర్తుచేశారు. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. జెత్వానీ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. పీఎ్‌సఆర్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారు జెత్వానీకి నోటీసులు అందలేదని తెలిపారు. అన్ని పక్షాల వాదనలనూ పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జెత్వానీకి నోటీసు అందించాలని పీఎ్‌సఆర్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. జూలై 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌కు స్పష్టం చేస్తూ విచారణను జూలై 21కి వాయిదా వేశారు.