Share News

High Court: లక్ష్మీపేట దళితుల హత్యకేసు విచారణపై హైకోర్టు స్టే

ABN , Publish Date - May 27 , 2025 | 05:58 AM

లక్ష్మీపేట దళితుల హత్య కేసులో సాక్షులకు సముచిత సమయం ఇవ్వకుండా విచారణను ప్రత్యేక కోర్టు మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణను జూన్ 16 వరకు నిలుపుదల చేసింది.

High Court: లక్ష్మీపేట దళితుల హత్యకేసు విచారణపై హైకోర్టు స్టే

16 వరకూ నిలిపేస్తూ ఉత్తర్వులు

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): ‘లక్ష్మీపేట దళితుల హత్య కేసు’లో సాక్షులకు సహేతుక సమయం ఇవ్వకుండా ప్రత్యేక కోర్టు హడావుడిగా విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సముచిత సమయం ఇవ్వకుండా సాక్ష్యాల నమోదును మూసివేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. సాక్ష్యాలు చెప్పేందుకు ప్రత్యేక కోర్టు మరికొంత సమయం ఇచ్చి ఉండాల్సింది అభిప్రాయపడింది. దళితుల హత్య కేసుతో పాటు మరో కేసును కలిపి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వీటికి ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కట్టుబడి వ్యవహరించలేదని గుర్తు చేసింది. ఈ నేపఽథ్యంలో లక్ష్మిపేటలోని ప్రత్యేక కోర్టులో విచారణను జూన్‌ 16 వరకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, లక్ష్మీపేట గ్రామంలో భూమి సాగుకు సంబంధించి 2012లో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఓ సామాజిక వర్గానికి చెందినవారు జరిపిన దాడిలో 5 గురు దళితులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు విచారణ కోసం లక్ష్మీపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సాక్షుల విచారణ జరుగుతుంది. అయితే సాక్ష్యాల నమోదును మూసివేస్తూ మే 19న ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, సాక్ష్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ బాధితులు గంగయ్య మరో ఐదుగురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జీవీ శివాజీ వాదనలు వినిపిస్తూ... ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదన్నారు. కేవలం 17 రోజుల్లోనే 86 మంది సాక్షులను విచారించారన్నారు. కేసులో ప్రధాన సాక్షులైన పిటిషనర్లకు సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా విచారణను మూసివేశారన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి... లక్ష్మిపేట ప్రత్యేక కోర్టులో విచారణపై జూన్‌ 16 వరకు స్టే విధిస్తూ ఉత్తర్వు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:58 AM