Share News

Srisailam Reservoir: శ్రీశైలంలోకి భారీ వరద

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:12 AM

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతూ ఆల్మట్టి, జూరాల జలాశయాలు దాటి శ్రీశైలంలోకి వస్తోంది

Srisailam Reservoir: శ్రీశైలంలోకి భారీ వరద

  • 1.13 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

  • ప్రస్తుత నీటి నిల్వ 126.34 టీఎంసీలు

  • మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాలకు ఆల్మట్టి డ్యాంలోకీ వరద ఉధృతి

కర్నూలు/అమరావతి/బెంగళూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతూ ఆల్మట్టి, జూరాల జలాశయాలు దాటి శ్రీశైలంలోకి వస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జలాశయానికి జూరాల నుంచి 1,13,362 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 866.10 అడుగుల వద్ద 126.34 టీఎంసీలకు వరద చేరింది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టిలోకి 1,15,339 క్యూసెక్కుల వరద వస్తుంటే.. కిందకు 70,420 క్యూసెక్కులను వదులుతున్నారు.


ఈ డ్యాంలో గరిష్ఠ నీటినిల్వ 129.72 టీఎంసీలకు గాను 85.3 టీఎంసీల నీరుంది. జూరాలకు 1,04,538 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 12 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 85,564 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 27,798 క్యూసెక్కులు కలిపి 1,13,362 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని కిందకు వదలడం లేదు. క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల ఆయకట్టు రైతుల్లో సాగునీటి ఆశలు చిగురిస్తున్నాయి.

ఇక నాగార్జున సాగర్‌ గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 138.91 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. పులిచింతల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను 23.41 టీఎంసీలు ఉన్నాయి. మరో 22.36 టీఎంసీల కొరత ఉన్నా.. తాగునీటి అవసరాలు, కృష్ణా ఆయకట్టు కోసం 2000 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ 3.07 టీఎంసీలకు గాను 2.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బ్యారేజీలోకి 1,586 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 2,373 క్యూసెక్కులను డెల్టాకు వదులుతున్నారు. కర్ణాటకలో కావేరి నదిపై నిర్మించిన ప్రధాన జలాశయం కృష్ణరాజసాగర డ్యాం పూర్తిగా నిండింది.

Updated Date - Jun 28 , 2025 | 03:12 AM