Weather Update: జూలైలో వానలే వానలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:00 AM
జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దేశంలోని 80 శాతం ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో మంచి వర్షాలు
విశాఖపట్నం, పోలవరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలైలో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 106 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. జూలై నెలకు సంబంధించి వర్షపాతం, ఉష్ణోగ్రతలపై సోమవారం బులెటిన్ విడుదల చేసింది. దేశంలోని 80 శాతం ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన 20 శాతం ప్రాంతాలు.. తమిళనాడు, కేరళ, బిహార్, ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మధ్యభారతం దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. గోదావరి, కృష్ణా బేసిన్‌లో పుష్కలంగా వర్షాలు కురవనున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా జూన్‌లో సగం రోజులు దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. రెండో అర్ధభాగంలో చాలా ప్రాంతాల్లో పుష్కలంగా వర్షాలు కురిశాయి.
దీంతో జూన్‌లో సాధారణం కంటే తొమ్మిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాగా, జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగింది. జూలైలో ఎక్కువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ నుంచి నెల్లూరు వరకు, నంద్యాల, కడప జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదవుతుంంది. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు కానుంది.
శ్రీశైలానికి భారీగా వరద
రాత్రి 11 గంటల సమయానికి 1,18,736 క్యూసెక్కుల ప్రవాహం
రెండువైపులా విద్యుదుత్పాదన ప్రారంభం
దిగువకు 58,750 క్యూసెక్కులు
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం 1.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. రాత్రి 11 గంటల సమయానికి 1,18,736 క్యూసెక్కులకు తగ్గింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను.. 157.49 టీఎంసీల నిల్వ ఉంది. నీటిమట్టం పెరగడంతో కుడి, ఎడమ భూగర్భ విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పాదన ప్రారంభించారు.
గోదావరికి వరద
గోదావరి నీటిమట్టం పెరగడంతో సోమవారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 34,426 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే 48గేట్లు, స్లూయిజ్ గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.
ఊరించి.. ఉసూరుమనిపించి!
‘అల్పపీడనం’తో వేసిన అంచనాలు తలకిందులు
రాష్ట్రంలో జూన్‌లో 23.8ు తక్కువ వానలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనంతో ఉత్తర కోస్తా వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్తర కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ కూడా విడుదల చేసింది. అయితే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మేఘాలు ఆవరించినప్పటికీ తుంపర తప్ప ఒక మోస్తరు వర్షం కూడా కురవలేదు. దీంతో అల్పపీడనం ఉసూరుమనిపించిందని వాతావరణ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. కాగా, జూలై తొలి వారం చివరిలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పలు మోడళ్లు చెబుతున్నాయి. అయితే బెంగాల్‌కు ఆనుకొని ఏర్పడే అల్పపీడనాల వల్ల ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో తప్ప కోస్తాంధ్ర, తెలంగాణ, ఛత్తీసగఢ్లో వర్షాలు కురిసే అవకాశం తక్కువని వాతావరణ నిపుణుడు ఒకరు విశ్లేషించారు.
రాష్ట్రంలో నిరాశపరిచిన ‘జూన్’
జూన్‌లో దేశవ్యాప్తంగా 165.3 మి.మీకు గానూ 180.8 మి.మీ (సాధారణం కంటే 9శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. అయితే ఏపీలో మాత్రం జూన్ నిరాశపరిచింది. జూన్‌లో 97.4 మి.మీ.కు గానూ 74.7 మి.మీ. వర్షపాతం (సాధారణం కంటే 23.8 శాతం తక్కువ) నమోదైంది. వర్షాలు తక్కువగా కురవడంతో మెట్ట పంటల సాగుపై ప్రభావం చూపుతుందని, వరి నారు పోసుకునేందుకు ఇంకా అనుకూల పరిస్థితులు రాలేదన్నారు.