AP High Court : ఉల్లంఘనలు లేకుంటే ట్రాన్సిట్ పర్మిట్ ఇవ్వండి
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:02 AM
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు 21న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి.. ఉల్లంఘనలకు పాల్పడని మైనర్ మినరల్ లీజు దారులకు నెల రోజుల్లోగా ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనులశాఖ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

మార్గదర్శకాలు పాటించండి
గనుల శాఖకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు 21న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి.. ఉల్లంఘనలకు పాల్పడని మైనర్ మినరల్ లీజు దారులకు నెల రోజుల్లోగా ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనులశాఖ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబరు 27 నుంచి వ్యాజ్యం పలుమార్లు విచారణకు వచ్చిందని, ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. వ్యాజ్యంపై విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. రాష్ట్రంలోని క్వార్ట్జ్, మైకా, సిలికాశాండ్ వంటి మైనర్ మినరల్ లీజు దారులకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేసేలా మైనింగ్‌శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ మైనింగ్ మినరల్ ఇండస్ట్రీ(ఫెమ్మీ) ప్రధాన కార్యదర్శి చెట్టి హనుమంతురావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ‘‘ఫెమ్మీ సభ్యులకు మైనింగ్ లీజు అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ వారందరూ జూన్, 2024 నుంచి మైనింగ్ పోర్టల్‌లో ట్రాన్సిట్ పర్మిట్‌లు పొందలేకపోతున్నారు. పర్మిట్లు జారీ చేసేలా అధికారులను ఆదేశించాలి’’ అని అభ్యర్థించారు. గనులశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ఉల్లంఘనలకు పాల్పడని మైనింగ్ లీజుదారులకు పర్మిట్లు జారీ చేసే విషయంలో గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గత ఏడాది అక్టోబరు 21న మార్గదరకాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన మెమోను కోర్టు ముందు ఉంచాం’’ అని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.