Share News

High Court: నిబంధనల ప్రకారం నడుచుకోండి

ABN , Publish Date - Jul 01 , 2025 | 06:18 AM

వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి విషయంలో చట్టనిబంధనల ప్రకారం నడుచుకోవాలని పురపాలకశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది

High Court: నిబంధనల ప్రకారం నడుచుకోండి

  • పెద్దారెడ్డి ఇంటి కూల్చివేతపై హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి విషయంలో చట్టనిబంధనల ప్రకారం నడుచుకోవాలని పురపాలకశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నివాసాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. తాడిపత్రిలోని సర్వే నెంబర్లు 639, 640, 641లోని 577.55 చదరపు గజాలలో ఉన్న తమ ఇంటి కూల్చివేతకు పురపాలకశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పెద్దారెడ్డి సతీమణి రమాదేవి హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌గా ఈ వ్యాజ్యాన్ని విచారణకు న్యాయమూర్తి స్వీకరించారు.


మాపై కేసు కొట్టేయండి.. హైకోర్టులో కాసు, అన్నాబత్తుని

వైసీపీ అధినేత జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి రోడ్లపై రాకపోకలను స్తంభింపజేశారంటూ వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్‌, వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టు ముందు విచారణకు రానుంది.

Updated Date - Jul 01 , 2025 | 06:18 AM