Share News

AP High Court : అనుచిత వ్యాఖ్యలపై బీఎన్‌ఎస్‌ చట్టం వర్తించదు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:55 AM

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవరెడ్డి, ఆ పార్టీ సానుభూతిపరులు పిటిషన్లు దాఖలు చేశారు.

 AP High Court :   అనుచిత వ్యాఖ్యలపై  బీఎన్‌ఎస్‌ చట్టం వర్తించదు!

సోషల్‌ మీడియా కేసులో సజ్జల న్యాయవాది వాదనలు

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవరెడ్డి, ఆ పార్టీ సానుభూతిపరులు పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఓ. మనోహర్‌రెడ్డి, న్యాయవాది వై. నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్లపై వ్యవస్థీకృత నేరం బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద కేసులు పెట్టడం చెల్లుబాటు కా దు. గత ఏడాది జూలైలో బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చింది. అంతకుముందు పెట్టిన పోస్టులకు కూడా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 వర్తింపజేస్తున్నా రు. ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తింపునకు సంబంధించి ప్రాధమిక ఆధారాలు లేవ ని కోర్టు సంతృప్తి చెందితే ఆ సెక్షన్‌ ఉన్నప్పటికీ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై కోర్టు విచారణ జరపొచ్చు. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా ఇతరులను నిందితుడిగా చేర్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎవిడెన్స్‌ యాక్ట్‌ ప్రకారం మేజిస్ట్రేట్‌ సమక్షంలో రికార్డు చేసిన వాంగ్మూలానికి మాత్రమే విలువ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై నమోదు చేసిన వివిధ కేసులు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. ఈ కేసుల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) ప్రకారం నోటీసులు ఇస్తామని పేర్కొంటూ సంబంధిత కేసుల వివరాలను కోర్టు ముందు ఉంచారు. అయితే, శుక్రవారం కోర్టు సమయం ముగియడంతో మరికొందరు పిటిషనర్లు, ప్రాసిక్యూషన్‌ తరఫు వాదనల కోసం న్యాయస్థానం విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. విజయ్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Feb 08 , 2025 | 03:56 AM