Share News

UPSC Recommendation: పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌ గుప్తా

ABN , Publish Date - May 27 , 2025 | 04:50 AM

ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న హరీశ్‌ కుమార్‌ గుప్తా, యూపీఎస్‌సీ సిఫారసుతో పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. 2027 మే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

UPSC Recommendation: పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌ గుప్తా

  • యూపీఎస్‌సీ సిఫారసు.. ప్రభుత్వ ఉత్తర్వులు.. 28న బాధ్యతలు

  • రెండేళ్లపాటు సేవలు

  • పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి డీజీపీ

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న హరీశ్‌ కుమార్‌ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) సిఫారసు మేరకు ఆయనను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2014 జూలైలో జేవీ రాముడు నియామకం తర్వాత ఏపీలో యూపీఎస్‌సీ ద్వారా నియమితులైన పూర్తిస్థాయి డీజీపీ.. హరీశ్‌ కుమార్‌ గుప్తా కావడం విశేషం. జమ్ముకశ్మీర్‌కు చెందిన హరీశ్‌ కుమార్‌ గుప్తా.. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఈ నెల 28న మూడోసారి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న హరీశ్‌ గుప్తా 2027.. మే 27 వరకూ డీజీపీగా కొనసాగుతారు. కాగా, నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరున్న హరీశ్‌ గుప్తాను గతేడాది మే 6న ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ డీజీపీగా నియమించింది. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం స్థానిక బీసీలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో హరీశ్‌ గుప్తాను తప్పించి ద్వారకా తిరుమలరావుకు గతేడాది జూన్‌ 19న అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరిలో ఆయన పదవీ విరమణ తర్వాత కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1న గుప్తాకు మరోమారు డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. రెండోసారి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గుప్తా మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తూ ‘శక్తి’ పోలీసింగ్‌ను అమలు చేశారు. పోలీసింగ్‌లోకి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేశారు. నేరాల కట్టడితోపాటు రాష్ట్రంలో పోలీసింగ్‌ తీరుతెన్నుల్నే మార్చేశారు. ఆయన పనితీరును గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఏపీ పోలీసు పనితీరు అద్భుతమంటూ ప్రశంసించారు. అదే తనకన్నా సీనియర్లను కాదని పోలీసు బాస్‌గా గుప్తాను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - May 27 , 2025 | 04:51 AM