Chairman Pasupuleti Hariprasad: హస్తకళాకారుల ఉన్నతికి కృషి చేస్తా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:22 AM
ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) కొత్త చైర్మన్‌గా పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హస్తకళాకారుల ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు.
లేపాక్షి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్
విజయవాడ (గాంధీనగర్), జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రధానీ నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు స్ఫూర్తితో హస్తకళాకారుల ఉన్నతికి తనవంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. విజయవాడలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హస్తకళలపై ఎంతో మక్కువ కలిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు ఈ అవకాశం కల్పించడం తన బాధ్యతలను మరింత పెంచినట్లయిందన్నారు. లేపాక్షి శాఖలను విస్తరించి తద్వారా విక్రయాలు పెరిగేలా కృషి చేస్తానన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. హరిప్రసాద్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, ఆరణి శ్రీనివాసులు, బొలిశెట్టి శ్రీనివాసులు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.