Share News

MP Mithun Reddy: మిథున్ రెడ్డి యూఎస్ టూర్‌‌‌ అనుమతిపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:18 PM

మిథున్ రెడ్డి యూఎస్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వు చేసింది.

MP Mithun Reddy: మిథున్ రెడ్డి యూఎస్ టూర్‌‌‌ అనుమతిపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

అమరావతి, అక్టోబర్ 16: మద్యం కేసులో నిందితుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఇటీవల బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.


అక్టోబర్ 26వ తేదీన అమెరికా వెళ్ళే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో మిథున్ రెడ్డి పేరు ఉన్న విషయం విదితమే. అయితే అక్టోబర్ 20వ తేదీన న్యూయార్క్ వెళ్లేందుకు తనను అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కేసులో అరెస్టయిన సందర్భంగా ఆయన పాస్ పోస్టును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ నేపథ్యంలో తనకు పాస్ పోర్ట్‌ను తిరిగి ఇప్పించాలని కోరుతూ.. ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిథున్ రెడ్డికి పాస్‌పోర్ట్ అందజేయాలంటూ సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది. అలాగే తనపై ఉన్న లుక్ ఔట్ సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో మిథున్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.


ఐక్యరాజ్య సమితికి వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చోటు దక్కింది. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో ఈ ప్రతినిధి బృందం అక్టోబర్ 27 నుంచి జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరుకానుంది. ఈ నేపథ్యంలో తనకు పాస్ట్ పోర్టు అందజేయాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి.. ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కానీ ఈ పార్లమెంటరీ బృందం అక్టోబర్27 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అందుకోసం ముందుగానే ఈ బృందం అమెరికా వెళ్తోంది.


2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి వరకు ఉన్న మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి కొత్త మద్యం బ్రాండ్లను మార్కెట్లో విడుదల చేశారు. ఇక ఈ మద్యం లావాదేవీలు ఎక్కడ ఆన్ లైన్‌లో జరగ లేదు. అదీకాక ఈ మద్యం బ్రాండ్లు తాగి వందలాది మంది మరణించారు. వేలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.


ఇక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఈ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో రూ. 3, 500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు సిట్ నిర్థారించింది. ఈ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం సిట్ అరెస్ట్ చేసింది. ఆ జాబితాలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సైతం ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 03:35 PM