Bhaskar reddy: ఎన్నారై భాస్కరరెడ్డికి మధ్యంతర బెయిల్..
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:17 PM
కృష్ణా జిల్లా పెనమలూరుకు మండలం చోడవరం గ్రామానికి చెందిన మాలపాటి భాస్కరరెడ్డి లండన్‌లో ఉంటూ మూడేళ్లుగా సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నాడు.
విజయవాడ, నవంబర్ 12: విదేశాల్లో ఉండి.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతిపరుడు, ఎన్నారై భాస్కరరెడ్డికి బుధవారం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 13వ తేదీన భాస్కరరెడ్డి తండ్రి పెద్ద కర్మ కార్యక్రమం. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును భాస్కరరెడ్డి ఆశ్రయించారు.
దీంతో భాస్కరరెడ్డికి సెకండ్ అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక భాస్కరరెడ్డి సోదరుడు ఓబుల్ రెడ్డికి సైతం కోర్టు నాలుగు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గతంలో వైసీపీ నేతల అండతో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తోపాటు టీడీపీ, జనసేన మహిళలపై నీచంగా పోస్టులు పెట్టినందుకు భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కృష్ణా జిల్లా పెనమలూరుకు మండలం చోడవరం గ్రామానికి చెందిన మాలపాటి భాస్కరరెడ్డి లండన్‌లో ఉంటూ మూడేళ్లుగా సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెడుతున్నాడు. వాటిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీంతో సాయికుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే పదేళ్ల కిందట భాస్కరరెడ్డి చదువు కోసం లండన్‌కు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డాడు. ఇటీవల తండ్రి మరణించాడు. దీంతో లండన్ నుంచి సొంతూరికి వచ్చాడు. అతడిని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో అనారోగ్యంతో భాస్కరరెడ్డి.. విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. పోలీసులు అతడికి అరెస్ట్ చేశారు.
ఈ సమయంలో పోలీసులపై భాస్కరరెడ్డి సోదరుడు ఓబుల్ రెడ్డి దాడి చేశాడు. దీంతో అతడిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించింది. దీంతో భాస్కరరెడ్డిని నెల్లూరు జైలుకు.. ఓబుల్ రెడ్డిని అవనిగడ్డ జైలుకు పోలీసులు తరలించారు.