Jagan Car Driver: పోలీసుల అదుపులోనే జగన్ కారు డ్రైవర్..
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:40 AM
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వైఎస్ జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు.
అమరావతి, జూన్ 23: సత్తెనపల్లి పర్యటనకు వెళ్లే క్రమంలో వైఎస్ జగన్ కారు కింద పడి వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనలో కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ కేసును పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 105 సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతోపాటు పూర్తి సాక్ష్యాలతో ముందుకు వెళ్లాలని వారు నిర్ణయించారు. ఈ సెక్షన్ కింద 10 ఏళ్లకుపైనే శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
అయితే 2011 నాటి నుంచి అంటే.. గత 14 ఏళ్లగా వైఎస్ జగన్ వద్ద రమణారెడ్డి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. ఇక ఈ సంఘటన జరిగిన రోజు అంటే.. జూన్ 18వ తేదీన వైఎస్ జగన్‌కు రక్షణగా ఉన్న పోలీస్ సిబ్బందిని సైతం పిలిపించి విచారించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ఎందుకంటే.. వైఎస్ జగన్ జెడ్ ప్లస్ కేటగిరిలో ఉండటంతో ఆయన వాహనం చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారు. అదీకాక జగన్ వాహనం కింద సింగయ్య పడిన సమయంలో ఈ దృశ్యాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వృద్ధుడు సింగయ్య కారు కింద పడిన అనంతరం అతడు కొన ఊపిరితో ఉండగా... అతనిని అక్కడి నుంచి తీసుకువచ్చి పొదల్లో పడేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను ఆదివారం రాత్రి పోలీస్ అధికారులు పిలిపించారు. వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అలాగే ఈ ఘటన చోటు చేసుకున్న ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బయలుదేరారు. ఆ క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ కింద వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అనే వృద్ధుడు పడిపోయాడు. అతడి తలపై నుంచి జగన్ కాన్వాయ్ వెళ్లింది. దీంతో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు.. సింగయ్య మృతికి కారణమని తొలుత పోలీసులు భావించారు. కానీ వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనమే సింగయ్య మృతికి కారణమని అనంతరం పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డి ఏ1గా, వైఎస్ జగన్‌ను ఏ2 గా, వాహన యజమానిని ఏ3గా పోలీసులు చేర్చారు. ఆదివారమే జగన్ కారు డ్రైవర్‌ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.