AP Government: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) రాష్ట్రంలో కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుపై తుది నోటిఫికేషన్‌ను ఇవాళ(మంగళవారం) విడుదల చేసింది. ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు జరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. ఈ మార్పులు రేపటి(బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి.
మార్పుల్లో నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చింది. సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్‌కు మారుస్తూ ఏపీ సర్కార్ కీలక మార్పులు చేసింది. అలాగే, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేయడం, పెనుగొండను వాసవీ పెనుగొడుగా మార్చడం వంటి మార్పులు కూడా నోటిఫికేషన్‌లో కూటమి సర్కార్ చేర్చింది.
అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌తో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయడం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చడం ద్వారా స్థానిక పరిపాలన మరింత సులభతరం అవుతుందని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ మార్పుల ద్వారా జిల్లా పరిపాలన, రెవెన్యూ కార్యకలాపాలు మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఈ నిర్ణయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సమగ్ర సేవలందించడానికి తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పౌరసేవల చేరిక వేగవంతం అవుతుందని... రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు స్థానిక అధికారుల ప్రవర్తనను మరింత సమర్థవంతంగా చేస్తాయని భావిస్తోంది.
తుది నోటిఫికేషన్ ప్రకారం, రేపటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ప్రజలు, స్థానిక సంస్థలు, అధికారులు అన్ని విధాలుగా ఈ మార్పులకు అనుగుణంగా తమ కార్యక్రమాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. ఈ కొత్త ఏర్పాట్లు ఏపీలో పరిపాలనలో మరింత సమర్ధత, ప్రజల చేరికలో సౌలభ్యం, స్థానిక అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడుతుంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సమగ్ర సేవలు, వేగవంతమైన పరిపాలన, వనరుల సమర్థవంతమైన వినియోగం అందించగలిగే అవకాశాలు పెరుగుతాయని ఏపీ సర్కార్ అనుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శదర్శనం
న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు
For More AP News And Telugu News