Guntur Student Accident: టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. గుంటూరు విద్యార్థిని మృతి
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:56 AM
అమెరికాలో టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో గుంటూరు విద్యార్థిని వి.దీప్తి మృతి చెందింది. ఎంఎస్ పూర్తి కావాల్సిన సమయంలో ఈ విషాదం కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది
రెండు నెలల్లో ఎంఎస్ పూర్తికానుండగా పెను విషాదం
గుంటూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్న గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వి.దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. టెక్సాస్‌లోని డెంటాన్ సిటీలో దీప్తి ఈ నెల 12వ తేదీన రోడ్డు పక్కన నడుచుకొంటూ వెళుతుండగా ట్రక్ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో దీప్తి స్నేహితురాలు స్నిగ్ధకు గాయాలయ్యాయి. స్నిగ్ధకు అక్కడి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండకు సమీపంలోని పెదకంచర్ల దీప్తి స్వగ్రామం. దీప్తి, ఆమె సోదరిని ఉన్నత చదువులు చదివించేందుకు వాళ్ల తండ్రి హన్మంతరావు గుంటూరు నగరంలోని రాజేంద్రనగర్‌కు వలస వచ్చారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో దీప్తి బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత చదువు కోసం ఆమె యూఎస్ వెళ్లింది. దీప్తి మే నెలలో ఎంఎస్ చదువు పూర్తి కానుండగా రోడ్డు ప్రమాదం ఆమె ఉసురు తీసింది. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత దీప్తి మృతదేహాన్ని శనివారం యూఎస్ నుంచి పంపించనున్నట్లు సమాచారం అందింది. సోమవారానికి హైదరాబాద్ విమానాశ్రయానికి దీప్తి మృతదేహం చేరుకొనే అవకాశం ఉంది.