Army Saluted: ఇండియన్ ఆర్మీకి సెల్యూట్
ABN , Publish Date - May 08 , 2025 | 03:34 AM
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ఇండియన్ ఆర్మీకి గవర్నర్, సీఎం, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. భారత సైన్యం ఇచ్చిన ప్రతిస్పందన దేశ గర్వకారణమని పేర్కొన్నారు.
జాతి గర్వించాల్సిన సమయం: గవర్నర్
ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన గవర్నర్, సీఎం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇండియన్ ఆర్మీకి ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సెల్యూట్ చేశారు. ఎక్స్ వేదికగా భారత్ బలగాలకు అభినందనలు తెలిపారు. కాగా, బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచానికి మన బలాన్ని.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్న కృతనిశ్చయాన్ని చాటి చెప్పామని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ కూడా ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘మన నేలపై మొలిచిన మొక్క కూడా పీకలేరు. వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ పేరు మోదీ’ అని పేర్కొన్నారు. పహల్గాం దాడికి భారత సైన్యం సరైన రీతిలో సమాధానం చెప్పిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ‘పాకిస్థాన్‌తో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చు. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే పాతేస్తామన్న సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని అయ్యన్న అన్నారు.
భారత ప్రభుత్వం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వందేమాతరం, భారత్ మాతాకి జై అన్న నినాదాలతో కార్యాలయ ప్రాంగణం హోరెత్తింది. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులపై జరిగిన దాడికి యావత్ దేశం గర్విస్తుందన్నారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ఓ ప్రకటన చేస్తూ... 140 కోట్ల మంది భారతీయుల ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు, బిగ్ సెల్యూట్ అని అన్నారు. మన సైన్యం, పాకిస్థాన్‌కు దీటైన సమాధానం ఇచ్చిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News