B. Rajasekhar: బాబును తిట్టు.. అయినా పోస్టు పట్టు!
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:20 AM
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైరయిన బి.రాజశేఖర్‌కు ప్రభుత్వం మరో ఏడాది పాటు సర్వీసు పొడిగించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా చంద్రబాబు ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
‘కక్ష సాధింపులకు పాల్పడను’... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్న మాట ఇది! మంచిదే! పాలకుడంటే ఇలాగే ఉండాలి! రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఏం చేసినా చట్ట పరిధిలోనే చేయాలి! కానీ... తనను దూషించిన, తన విధానాలను కాసింత బహిరంగంగానే వ్యతిరేకించిన, వైసీపీతో బాగా అంటకాగిన అధికారికి పిలిచి ‘మళ్లీ’ పీఠం ఇవ్వడాన్ని ఏమంటారు? అది కూడా... చట్టం అనుమతించకపోయినా ‘నువ్వే కావాలి’ అంటూ సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎలా చూడాలి? ఇది అతి మంచితనమా? అవగాహన లేకపోవడమా? ఎవరైనా తప్పుదారి పట్టించారా? ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ సర్వీసును ఏడాది పాటు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది!
బుడితి రాజశేఖర్ సర్వీసు పొడిగింపుపై విస్మయం
2014-19లోనూ ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం
అయినా సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం
మీడియా సమక్షంలోనే సీఎంపై మండిపాటు
జగన్ సీఎం అయ్యాక ఆయనకు వీరవిధేయుడు
రిటైరయ్యాక మరో ఏడాది సర్వీసుకు నేడు చాన్స్
డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా అందలం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైరయిన బి.రాజశేఖర్‌కు ప్రభుత్వం మరో ఏడాది పాటు సర్వీసు పొడిగించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా చంద్రబాబు ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాజశేఖర్‌కు పదోన్నతి లేకుండానే ఆయన హోదాను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మార్చారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఏనాడూ కృతజ్ఞత చూపలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చాక కరువు పరిస్థితులపై సమీక్ష చేయడానికి అధికారులను సమావేశానికి ఆహ్వానించారు. అప్పుడు కొందరు అధికారులు నోవాటెల్ హోటల్‌లో సమావేశమై ముఖ్యమంత్రి సమీక్షకు ఎవరూ వెళ్లకూడదని నిర్ణయించారు. ఇది ఒకరకంగా చంద్రబాబుపై తిరుగుబాటు ప్రకటించడమే. ఈ సమావేశంలో కీలక పాత్ర రాజశేఖర్‌దే. అలాగే 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో నాలుగో బ్లాక్ ముందు మీడియా సమక్షంలోనే.. ‘ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటే డబ్బులు చంద్రబాబు ఇస్తాడా? మీడియా ఇస్తుందా?’ అంటూ సీఎంపైనే బహిరంగంగా మండిపడ్డారు. రాజశేఖర్ శాఖల్లో సాధించిన ఘనతలు పెద్దగా లేవు కానీ చంద్రబాబుపై నోరు పారేసుకోవడం ద్వారా మాత్రమే మీడియాలో హైలైట్ అయ్యారు. జగన్ సీఎం అయ్యాక ఆయనకు వీరవిధేయుడిగా మారిపోయారు.
ఏడాదిలో ‘కొరత’ తీరుతుందా?
అధికారుల కొరత ఉందంటూ రాజశేఖర్ ఏడాది పాటు పదవిలో కొనసాగే అవకాశం కల్పించారు. అయితే ఏడాది తర్వాత కూడా అధికారుల కొరత సమస్య తీరదు. అధికారుల కొరత సమస్య నుంచి బయట పడాలంటే అదనపు అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రాన్ని కోరి అదనపు అధికారులను తెచ్చుకున్నారు. కానీ చంద్రబాబు ఇలా చేయలేదు. అధికారుల కొరత ఉందని చెబుతున్నప్పుడు రాజశేఖర్‌తో పాటు అదేరోజు రిటైరయిన మరో ఐఏఎస్ పోలా భాస్కర్ సర్వీస్ కాలం ఎందుకు పొడిగించలేదో? జలవనరులు, విద్యుత్, ఆర్థికం లాంటి ప్రత్యేక శాఖల్లో టెక్నికల్ అంశాలు అర్థం చేసుకోవడం కష్టం. అందరు అధికారులూ ఈ శాఖలు చేయలేరు. కానీ వ్యవసాయ శాఖ సాధారణ సబ్జెక్టు. ఏ అధికారైనా అవలీలగా చేయగలరు. రాజశేఖర్ 2014-19 సమయంలో నాలుగేళ్ల పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేశారు. ఇప్పుడు కూడా అదే శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు.
రీఅపాయింట్‌మెంట్ తర్వాత కూడా అదే శాఖలో అదే హోదాలో కొనసాగుతున్నారు. నిబంధనలకు విరుద్ధం: అఖిల భారత సర్వీసు అధికారులకు పదవీ విరమణ తర్వాత సర్వీసు పొడిగింపు కుదరదని డీవోపీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రిటైరయిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చినా సలహాదారుగానో, కన్సల్టెంట్‌గానో, ఓఎ్‌సడీగానో తీసుకోవచ్చు. అంతేకానీ సంతకాలు పెట్టి జీవోలు ఇచ్చే అధికారం ఇవ్వడం డీవోపీటీ నిబంధనలకు విరుద్ధం. పదవీకాలం పొడిగింపు తీసుకుని సర్వీసులో కొనసాగే సౌకర్యం ఒక్క చీఫ్ సెక్రటరీకి మాత్రమే ఉంది. అందుకు కూడా కేంద్రం అనుమతించాలి. రిటైరయిన స్పెషల్ సీఎ్‌సను రీఅపాయింట్‌మెంట్ పేరుతో అదే పోస్టులో నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, సీఎస్ పదవీకాలం పొడిగింపు కోసం డీవోపీటీ అనుమతి ఎందుకు కోరుతుంది? ఏడాది పాటు సర్వీసు పొడిగింపు ఇచ్చారంటే కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వంలోకి తీసుకున్నట్టు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీవోలు ఇచ్చే అధికారం ఉండదు.
ఒక్కటే తేడా
గతంలో జగన్ హయాంలో తనకు అనుకూలంగా పనిచేసే అధికారులు రిటైరయ్యాక రీఅపాయింట్‌మెంట్ పేరుతో ఇలా ఏడాది పాటు సర్వీసు పొడిగించారు. ఐఏఎ్‌సలు ఉషారాణి, కరికల్ వలవన్, విజయ్ కుమార్‌కు రీఅపాయింట్‌మెంట్ ఇచ్చారు. తనకు కావాల్సిన ఫైళ్లపై సంతకాలు పెట్టించుకున్నారు. అప్పుడు జగన్ చేసింది తప్పు. నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పంథాలో నడుస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు ఒక్క తేడా ఏంటంటే... జగన్ తన అనుకూల అధికారులకు సర్వీసు పొడిగించి వాడుకోగా, చంద్రబాబు మాత్రం తనను ఏనాడూ లెక్కచేయని ఓ అధికారికి సర్వీసు పొడిగించి అందలమెక్కించారు.