Gold Fraud: తక్కువ ధరకు బంగారు ఇప్పిస్తామని.. రూ.7.32 కోట్లు కొట్టేశారు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:05 AM
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని ఓ వైద్యుడి నుంచి రూ.7.32 కోట్లు కొట్టేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సోమవారం విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు.
కర్నూలులో నలుగురి అరెస్టు
బాధితుడు విజయవాడకు చెందిన వైద్యుడు
కర్నూలు క్రైం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని ఓ వైద్యుడి నుంచి రూ.7.32 కోట్లు కొట్టేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సోమవారం విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు. విజయవాడ సూర్యారావు పేట చెందిన డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్ రెడ్డి తదితరులు నమ్మించారు. ఈంతో ఆయన రూ.7.32 కోట్ల మొత్తాన్ని వారి అకౌంట్లకు బదిలీ చేశారు. అయితే బంగారం ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. జూన్ 26న నిందితులు నెల్లూరు జిల్లా కావలిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా, కొట్టేసిన సొమ్ముతోనే పీటర్ పాల్, సుధీర్ కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
వారి ఇళ్లలో సోదాలు చేసి, పోలీసుల యూనిఫామ్‌లతో పాటు రూ.40 వేల నగదు, రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు, రెండు పోలీసు లాఠీలు, హెచ్‌పీ ల్యాప్‌టాప్, రెండు వాకీటాకీలు, అదే సమయంలో మిగతా నిందితులు కావలికి చెందిన పోతురాజు రతన్ కుమార్, పోతురాజు శాంతి పవన్ కుమార్ అలియాస్ వసంత్, కట్ట శ్రీకాంత్ అలియాస్ విశ్వనాథ్ బుచ్చిరెడ్డిపాలెం మండలం కొవ్వూరుకు చెందిన పాలకుర్తి జశ్వంత్ నెల్లూరులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు, దొంగ బంగారం చిన్న బిస్కెట్లు 16, పెద్దవి 15 బిస్కెట్లు రూ.6 లక్షలు నగదు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.