Guillain-Barré Syndrome : వణికిస్తున్న జీబీఎస్..!
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:56 AM
మహారాష్ట్ర, తెలంగాణల్లో కలకలం రేపిన ఈ అరుదైన నరాల వ్యాధి ఇప్పుడు ఏపీని కూడా వణికిస్తోంది.

ఏడాది వ్యవధిలో జీజీహెచ్‌లో 115 కేసులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 జీబీఎస్ కేసులు
గుంటూరు మెడికల్, విశాఖపట్నం, ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్).. మొన్నటి వరకూ మహారాష్ట్ర, తెలంగాణల్లో కలకలం రేపిన ఈ అరుదైన నరాల వ్యాధి ఇప్పుడు ఏపీని కూడా వణికిస్తోంది. తాజాగా గుంటూరు, విశాఖపట్నంలో ఈ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్ల కిందట గుంటూరు జీజీహెచ్‌లో ఏడాది మొత్తం మీద 10-15 జీబీఎస్ కేసులు నమోదయ్యేవి. అవి కూడా తీవ్ర రూపం దాల్చకుండానే తగ్గేవి. అయితే కొవిడ్ తర్వాత నుంచి వీటి ఉధృతి అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా 2024 మార్చి నుంచి ఇప్పటివరకు.. ఏడాది వ్యవధిలో ఏకంగా 115 జీబీఎస్ కేసులు నమోదవడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో ఈ జబ్బు బారిన పడిన రోగుల్లో 15 శాతం మందికి మాత్రమే ఇమ్యునోగ్లోబిలిన్ వంటి శక్తివంతమైన మందులు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన 85 శాతం మంది సపోర్టివ్ థెరపీ, యాంటీ బయోటిక్ మందులతోనే కోలుకునే వారు. అయితే ఈ ఏడాదికాలంలో నమోదైన 115 కేసుల్లో తీవ్రత అధికంగా ఉండటంతో ఏకంగా 65 మందికి ఇమ్యునోగ్లోబిలిన్ మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఖరీదైనవి కావడంతో ఆరోగ్య శాఖపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఏకంగా 50 శాతం మందికిపైగా రోగులకు ఐజీజీ ఇంజెక్షన్లు వినియోగించాల్సి వచ్చింది. రోగ లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, జీబీఎస్ అంటువ్యాధి కాదని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు.
విశాఖలో ఐదుగురికి..ఏలూరులో బాలికకు...
విశాఖపట్నంలోనూ జీబీఎస్ కలకలం రేపుతోంది. విశాఖలో గత నాలుగు రోజుల్లో ఐదు కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం బాధితులంతా కేజీహెచ్‌లోని జనరల్ మెడిసిన్ విభాగం పరిధిలోని ఎక్యూట్ మెడికల్‌కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ వ్యాధి పట్ల ఆందోళన వద్దని, కేజీహెచ్‌లో ఈ తరహా కేసులు నెలకు పది వరకు నమోదవుతుంటాయని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ గోపి వెల్లడించారు. కాగా, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఐదేళ్ల బాలికకు జీబీఎస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి.
సాధారణ వ్యాధే.. ఆందోళన వద్దు: కృష్ణబాబు
గులియన్ బారే సిండ్రోమ్ సాధారణ వ్యాధని, దీని గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఎంటీ కృష్ణబాబు, డీఎంఈ డాక్టర్ డీఎ్‌సవిఎల్ నరసింహం శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని సందర్శించి ఏడుగురు జీబీఎస్ బాధితులను పరామర్శించారు. ‘గుంటూరులో జీబీఎస్ కలకలం’ పేరిట శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ఆరోగ్య శాఖ స్పందించింది. శుక్రవారం ఉదయమే అధికారులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి న్యూరాలజీ విభాగానికి వచ్చి చికిత్స పొందుతున్న జీబీఎస్ రోగులను పరామర్శించారు. వైద్య అధికారులతో చర్చించారు. అనంతరం కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 మంది జీబీఎ్‌సతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏడుగురిలో కోలా మెర్సీ (19), శ్రేష్ట (7) కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. బి కమలమ్మ (40) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, వి.ఆశీర్వాదం (50) ఐసీయూలో కోలుకుంటున్నారని తెలిపారు. షేక్ గోర్జాన్, వి.నాగవేణి (20), ఎస్‌కే రమీజా (44) జీబీఎ్‌సకు చికిత్సలు పొందుతున్నారని ఎంటీ కృష్ణబాబు ప్రకటించారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఇమ్యునో గ్లోబిలిన్ ఇంజెక్షన్లు అందుబాట్లో ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారని తెలిపారు.