Share News

Former MP Assault Case: వ్యక్తిని చితక బాదిన కేసులో...నందిగం సురేశ్‌ అరెస్టు

ABN , Publish Date - May 19 , 2025 | 05:47 AM

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తిని కర్రలతో చితకబాదిన ఘటనపై తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు తీవ్రంగా గాయపడగా, కేసులో ఆయన భార్య బేబి సహా మరో 8 మంది మీద కూడా కేసు నమోదైంది.

Former MP Assault Case: వ్యక్తిని చితక బాదిన కేసులో...నందిగం సురేశ్‌ అరెస్టు

  • ఆయన భార్య, అనుచరులపైనా కేసు

తుళ్లూరు, మే 18(ఆంధ్రజ్యోతి): బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆదివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఉద్దండరాయునిపాలెం బొడ్డు రాయి సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంంలో గ్రామానికి చెందిన ఇసుకపల్లి కృష్ణ అలియాస్‌ రాజుకు నందిగం సురేశ్‌ కారు తగిలింది. ఏమిటని ప్రశ్నించిన రాజును... సురేశ్‌, అతని అనుచరులు 8మంది కలసి విపరీతంగా కొట్టారు. మాజీ ఎంపీ ఇంటికి తీసుకెళ్లి నందిగం భార్య, అనుచరులు కర్రలు, చెప్పులతో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆయన బంధువులు మంగళగిరి ఎయిమ్స్‌లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నందిగం సురేశ్‌, అతని భార్య బేబి, అనుచరులు 8మంది మీద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. కాగా, నందిగం సురేశ్‌ను అరెస్టు చేయటంతో కొంతమంది అనుచరులు స్టేషన్‌ దగ్గరకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకుని గేటు మూసేశారు. సురేశ్‌ భార్య బేబిని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రోన్‌లతో తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని గతంలో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాజు ఏం చేశాడో విచారించకుండా తన భర్తను అరెస్టు చేయటం ఏంటని స్టేషన్‌ వద్ద పోలీసులతో వాదనకు దిగారు.

Updated Date - May 19 , 2025 | 05:49 AM