Share News

Polavaram Inspection: గోడ నాణ్యతపై సంతృప్తి

ABN , Publish Date - May 06 , 2025 | 05:18 AM

పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా, డయాఫ్రం వాల్‌, బట్రస్‌ డ్యాం నిర్మాణ పనులను విదేశీ నిపుణులు పరిశీలించారు. పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన నిపుణులు, బావర్‌ కంపెనీతో భూమి పొరలను తవ్వడం పై అభిప్రాయమిచ్చారు

Polavaram Inspection: గోడ నాణ్యతపై సంతృప్తి

  • నేడు లోతైన విశ్లేషణ చేపడతామన్న విదేశీ నిపుణులు

  • పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటన

  • డయాఫ్రం వాల్‌, బట్రస్‌ డ్యాం పనుల పరిశీలన

  • ‘వెదర్‌రాక్‌’పై జలవనరుల శాఖకు మద్దతు

  • వారి వెంట కేంద్ర, రాష్ట్ర అధికారులు

అమరావతి/పోలవరం, మే 5 (ఆంధ్రజ్యోతి): డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనుల్లో వేగం, నాణ్యతపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వాటిపై మంగళవారం లోతైన విశ్లేషణ చేస్తామన్నారు. ఆదివారమే రాజమహేంద్రవరం చేరుకున్న అమెరికా నిపుణులు డేవిడ్‌ బి.పాల్‌, జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో.. కెనడాకు చెందిన సీన్‌ హెంచ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చారు. తొలుత సమావేశ కార్యాలయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లు, అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం డయాఫ్రం వాల్‌ నిర్మాణ ప్రాంతంలో పనులను, బట్రస్‌ డ్యాం పనులను పరిశీలించారు. బట్రస్‌ డ్యాం నిర్మాణంలో వినియోగిస్తున్న రాతి, కాంక్రీట్‌ నాణ్యత, జరుగుతున్న పనుల విధానాలను, డయాఫ్రంవాల్‌ నిర్మాణ ప్రాంతంలో పనులను పరిశీలించారు. డయాఫ్రం వాల్‌, బట్రస్‌ డ్యాం నిర్మాణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం.. నేల గట్టిదనానికి చేస్తున్న పనులు, బట్రస్‌ డ్యాం నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎగువ కాఫర్‌ డ్యాం పటిష్ఠతకు చేపట్టిన పనులను తిలకించారు.


ఇంజనీర్లను వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రాజక్టు సీఈ కె.నరసింహమూర్తి, మేఘా సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అంగర సతీశ్‌బాబు, బావర్‌ కంపెనీ ప్రతినిధి హసన్‌ ఆ వివరాలన్నీ తెలియజేశారు. నిపుణుల వెంట పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్‌జిత్‌ సింగ్‌ భక్షి, అశ్వినీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, హేమంత్‌ గౌతమ్‌, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) అధికారులు మనీశ్‌ గుప్తా, లలిత్‌ కుమార్‌ సోలంకి, వాప్కోస్‌ ప్రతినిధులు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, బావర్‌, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు తదితరులు పర్యటించారు. మధ్యాహ్నం రెండు గంటల దాకా క్షేత్ర స్థాయి పర్యటన చేసిన నిపుణులు.. ప్రాథమికంగా డయాఫ్రం వాల్‌ నిర్మాణంపైనా.. కాంక్రీట్‌ మిక్చర్‌పైనా సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే వెదర్‌రాక్‌ (పిండి రాయి)ని పరిగణనలోకి తీసుకోకుండా.. భూమి పొరల్లో ఉన్న గట్టి రాయిని రెండు మీటర్లు తవ్వాలని రాష్ట్ర జల వనరుల శాఖ చేసిన సూచనలతో బావర్‌ ఏకీభవించలేదు.


మరింత లోతుగా గట్టి రాయి తగిలేంత వరకూ వెళ్తే.. సమయం వృధాతో పాటు ఖర్చుకూడా పెరుగుతుందని పేర్కొంది. దీనిపై జల వనరుల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెదర్‌రాక్‌ను చేత్తో ముట్టుకుంటేనే పిండిలా రాలిపోతుందని.. దానికి గట్టిదనం ఉండదని.. అందువల్ల సహజసిద్ధమైన గట్టి రాయి తగిలాక.. దానిపై రెండు మీటర్ల లోతులో తవ్వితేనే నిర్మాణంలో గట్టిదనం ఉంటుందని తేల్చిచెప్పింది. కాంట్రాక్టు ఒప్పందంలోను, వాల్‌ డిజైన్‌లోనూ ఇదే తరహాలో పనులు చేయాలని ఉందని గుర్తుచేసింది. ఉభయపక్షాల వాదనలను ఆసాంతం విన్న అమెరికా, కెనడా నిపుణులు.. జల వనరుల శాఖ సూచనలనే సమర్థించారు. మంగళవారం మరింత లోతుగా విశ్లేషిద్దామన్నారు. ప్రస్తుత పనులు తమ సూచనలు, సలహాలు, డిజైన్ల మేరకే జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - May 06 , 2025 | 06:15 AM