Share News

DSP Venkataramiah : ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దారుణ హత్య

ABN , Publish Date - Jan 25 , 2025 | 06:36 AM

శుక్రవారం ఉదయం 11 గంటలకు విధులకు బైక్‌పై వెళ్తున్న ఆయనను దుండగులు వెంబడించి, కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరయ్యారు.

 DSP Venkataramiah : ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దారుణ హత్య

  • ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి

  • టీడీపీ నాయకులే చంపించారు.. బాధితుల ఆరోపణ

ఆలూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బండారి ఈరన్న హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు విధులకు బైక్‌పై వెళ్తున్న ఆయనను దుండగులు వెంబడించి, కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరయ్యారు. ఉద్యోగం విషయంలో నెలకొన్న వివాదాల కారణంగా టీడీపీ నేతలే ఈరన్నను హత్యచేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. ఆలూరు మండలం అరికెర గ్రామ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా బండారి ఈరన్న(50) గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ స్థానిక నాయకులు ఈరన్నను ఉద్యోగం వదిలేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని అధికార పార్టీకి చెందిన కొందరు ఇటీవల బెదిరించారు. మాట వినకపోవడంతో చివరకు ఆయనను కడతేర్చారని బాధితులు ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌, ఆయన కుమారుడే ఈరన్నను హత్యచేయించారని భార్య నాగలక్ష్మి, మామ మల్లయ్య ఆరోపించారు. కాగా, డీఎస్పీ వెంకటరామయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులను ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు.

Updated Date - Jan 25 , 2025 | 06:36 AM