Karnataka road accidents: నెత్తురోడిన కర్ణాటక రహదారులు
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:27 AM
కర్ణాటకలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
యాక్సిల్ రాడ్డు విరిగి బోల్తా పడిన వాహనం
ముగ్గురు వేద విద్యార్థులు, డ్రైవర్ దుర్మరణం
మంత్రాలయం నుంచి హంపిలో ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా దారుణం
మరో ప్రమాదంలో లారీ బోల్తాపడి పది మంది మృతి
18 మందికి గాయాలు.. ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం
మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం 5 లక్షలు పరిహారం
మంత్రాలయం/ బళ్లారి/ రాయచూరు/ బెంగళూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో కర్నూలు జిల్లా మంత్రాలయంలోని సంస్కృత పాఠశాలకు చెందిన వేద విద్యార్థులు ముగ్గురు, ఒక డ్రైవర్ ఉండగా మరో పదిమంది కర్ణాటక వాసులు. పోలీసుల కథనం మేరకు... మధ్వాచార్యుల ప్రత్యక్ష ప్రథమ శిష్యులైన శ్రీనరహరితీర్థుల ఉత్తరారాధన పూజల కోసం మంత్రాలయం నుంచి 20 వాహనాల్లో వేద విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, నాయకులు, మఠం సిబ్బంది కలసి దాదాపు 300 మంది మంగళవారం రాత్రి హంపి వెళ్లారు. ఒక వాహనంలో గురుసార్వభౌమ సంస్కృత పాఠశాల వేద విద్యార్థులు 13మంది ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో రాయచూరు జిల్లా పోతనాల గ్రామం వద్ద యాక్సిల్ రాడ్డు విరగడంతో వాహనం రోడ్డుపై మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రాలయానికి చెందిన డ్రైవర్ కంసాలి శివ(20) అక్కడికక్కడే మృతిచెందగా, గుంజెల్లి సుజయీంద్ర (22), బళ్లారికి చెందిన హయవదన(19), కొప్పళకు చెందిన అభిలాష్ (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న కర్ణాటక, ఏపీ, తెలంగాణకు చెందిన మరో 10 మంది వేద విద్యార్థులు సింధనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బళ్లారికి చెందిన వేద విద్యార్థి జయసింహ పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, సిద్దరామయ్య, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సిద్దరామయ్య రూ3లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
కన్నీరు పెట్టుకున్న పీఠాధిపతి
సంస్కృత పాఠశాల విద్యార్థులు మృతిచెందడంపై పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు కన్నీరు పెట్టుకున్నారు. నరహరితీర్థుల ఆరాధన పూజలపై సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రావడంతో సంబరాలు చేసుకునే సమయంలో ఈ ఘటనతో సంబరాలు రద్దు చేసుకున్నారు. మృతుల కుటంబాలను ఆదుకుంటామని పీఠాధిపతి చెప్పారు.
పది మంది ఉసురు తీసిన పొగమంచు
పండ్లు, కూరగాయలు తరలిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పది మంది మృతిచెందారు. 18మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గుళ్ళాపుర వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా, ఎదురుగా వస్తున్న వాహనానికి దారి వదిలే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, లారీ గుంతలోకి బోల్తా పడింది. దీంతో పండ్లు, కూరగాయల సంచులపై కూర్చున్నవారు వాటి కింద ఇరుక్కుని, ఊపిరాడక విలవిల్లాడారు. అక్కడికక్కడే 9మంది చనిపోగా, ఆస్పత్రిలో మరొకరు మరణించారు. పొగమంచు కారణంగా సుమారు గంటపాటు ఎవరూ ఘటనను గుర్తించలేకపోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్పారు. మృతులను ఫయాజ్ ఇమాంసాబ్ జమఖండి(45), వసీమ్ విరుల్లా ముడగేరి(35), ఇజాజ్ ముస్తాక్ ముళ్ళ(20), సాదిక్ బాషా (30), గులాం హుసేన్ జవళి(40), ఇంతియాజ్ మంజఫర్ ముళకే (36), అల్ఫాజ్ జాఫర్ మండక్కి(25), జిలాని అబ్దుల్ జఖాతి(25), అస్లాం బాబులి బెన్నె(24), జలాల్ తార(30)గా గుర్తించారు. వీరంతా సంతల్లో వ్యాపారాలు చేస్తుంటారు. ప్రమాదంపై సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి
Also Read: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం
Also Read: : గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్
Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్
Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ
For AndhraPradesh News And Telugu News