Share News

Anantapur : ‘అనంత’ రైతన్నకు టీడీపీ అండ

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:29 AM

సమస్య పరిష్కారం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించిన అనంతపురానికి చెందిన ఓ రైతుకు న్యాయం జరిగింది.

Anantapur : ‘అనంత’ రైతన్నకు టీడీపీ అండ

  • పార్టీ కేంద్ర కార్యాలయం జోక్యంతో విద్యుత్‌ సమస్య పరిష్కారం

  • దానిమ్మ తోటను కాపాడుకున్న శ్రీనివాసులు

  • కృతజ్ఞతగా తోటలో సీఎం చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతల ఫొటోలు

నార్పల, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): సమస్య పరిష్కారం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించిన అనంతపురానికి చెందిన ఓ రైతుకు న్యాయం జరిగింది. పార్టీ నేతల చొరవతో అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ సదుపాయం కల్పించడంతో 11 ఎకరాల్లో ఎండిపోయే పరిస్థితికి చేరుకున్న దానిమ్మ తోటకు నీరు అందించి కాపాడుకున్నాడు. దీంతో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతల ఫొటోలను తోటలోని బోరు బావి వద్ద ఏర్పాటుచేసి కృతజ్ఞత తెలిపాడు. అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లికి చెందిన శ్రీనివాసులు 11 ఎకరాల్లో దానిమ్మ పంట సాగు చేశాడు. బోరుబావులు ఇంకిపోవడంతో 2నెలల వ్యవధిలో రూ.28 లక్షలు వెచ్చించి ఏకంగా 48 బోరు బావులను తవ్వించాడు. ఒక్క బోరులో మాత్రమే పుష్కలంగా నీరు పడింది. కానీ గిట్టని వారు ఆ రైతుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా బోరు బావులు తవ్వించాడని, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వొద్దని పిటిషన్‌ పెట్టారు. బాధిత రైతు 9నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగినా విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. నీరు అందక రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన దానిమ్మ తోట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీనివాసులు దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.


చివరి ప్రయత్నంగా తన భార్య, కూతురుతో కలిసి గతనెల 30న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మంత్రి కొండపల్లి శ్రీనివాసులు, పార్టీ నేత గండి బాబ్జీని కలిసి వినతిపత్రం సమర్పించాడు. స్పందించిన వారు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ, విద్యుత్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లారు. రైతు శ్రీనివాసులు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించలేదని గుర్తించి, వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. తర్వాత ఆ రైతు నీరుపెట్టి దానిమ్మ తోటను కాపాడుకున్నాడు.

Updated Date - Feb 16 , 2025 | 04:29 AM