Facial Recognition: దేవదాయ శాఖలో ఎఫ్‌ఆర్‌ఎస్
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:49 AM
దేవదాయ శాఖ పరిధిలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్..
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ పరిధిలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేయనున్నారు. వారి జీతాలను దీనికి అనుసంధానం చేశారు. ఆలయాల్లో కైంకర్యాలు నిర్వర్తించే అర్చకులకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. అర్చకులకు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని 2017లో అప్పటి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అర్చక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే దేవదాయ శాఖ పరిధిలో విధులు నిర్వహించే వారంతా ఎఫ్‌ఎ్‌సఆర్ విధానంలో కచ్చితంగా హాజరు వేయాలని తిరుపతి రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్య వేదికకు చెందిన అర్చకులు దేవదాయ శాఖ కమిషనర్‌ను మంగళవారం కలిశారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అంశంహైకోర్టు పరిధిలో ఉందని, తిరుపతి ఆర్జేసీ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని వినతిపత్రం అందించారు. ఈ మేరకు అర్చకులందరికీ ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి మినహాయింపు ఇస్తూ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.