Anantapur: పెద్దారెడ్డి కబ్జా పర్వం
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:20 AM
అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టారని అధికారులు నిర్ధారించారు.
2 సెంట్ల సర్కారు స్థలం ఆక్రమించి ఇల్లు కట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. నిర్ధారించిన అధికారులు
తాడిపత్రి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టారని అధికారులు నిర్ధారించారు. రెండు సెంట్ల సర్కారు స్థలాన్ని ఆయన కబ్జా చేశారని గుర్తించారు. తాడిపత్రి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. మాజీ ఎమ్మెల్యే తన భార్య రమాదేవి పేరిట 639, 640, 641 సర్వే నంబర్లలో ప్లాట్ నంబర్లు 2, 15లో 10 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించారు. ప్లాన్ ప్రకారం 5 సెంట్ల స్థలానికి మాత్రమే అనుమతులు తీసుకుని, 10 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించారని మున్సిపల్ అధికారులు తెలిపారు.
కొలతలు వేసిన అనంతరం సుమారు 2 సెంట్ల మేర మున్సిపాలిటీ స్థలాన్ని పెద్దారెడ్డి ఆక్రమించినట్లు తేలిందన్నారు. ఇంటి అక్రమ నిర్మాణం విషయంలో గతంలోనూ మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అక్రమాల గురించి ఈ ఏడాది మార్చి 11న రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు కూడా తెలిపారు. ఆక్రమణలను నిర్ధారించేందుకు భారీ పోలీసు బందోబస్తు నడుమ టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత, సర్వేయర్ కైవల్యసాయి, మండల సర్వేయర్ రాంమోహన్ శనివారం కొలతలు వేశారు.