Share News

AP Government: పుష్కలంగా ఎరువులు

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:44 AM

వర్షాలు ఆలస్యమై రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు మందకొడిగా సాగుతున్నా ఎరువుల విషయం రైతులు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది..

AP Government: పుష్కలంగా ఎరువులు

సీఎం ఆదేశాలతో అన్నిచోట్లా అందుబాటులో

  • మార్క్‌ఫెడ్‌లో బఫర్‌ స్టాక్‌ కూడా..

  • ఇప్పటికే 5.06లక్షల టన్నుల అమ్మకం

  • ప్రస్తుతం 8.64లక్షల టన్నుల నిల్వలు రెడీ

  • అన్నిరకాలపైనా రైతులకు సబ్సిడీ

  • కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వర్షాలు ఆలస్యమై రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు మందకొడిగా సాగుతున్నా ఎరువుల విషయం రైతులు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. సీజన్‌కు అవసరమైన మేరకు అంచనా వేసి, కేంద్రప్రభుత్వంతో ఎప్పటి కప్పుడు చర్చించి, రాష్ట్రానికి రావాల్సిన కోటా ప్రకారం వ్యవసాయశాఖ ఎరువుల్ని తెప్పిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎరువుల కోసం రైతులు ఎక్కడా బారులు తీరకుండా ఎప్పటికప్పుడు తీసుకెళ్లేలా అన్ని రకాల ఎరువుల్ని రైతులకు అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకే ఎక్కువగా ఎరువులు కేటాయించి, సహకార సంఘాలు, రిటైల్‌ డీలర్లకు నామమాత్రంగా సరఫరా చేసింది. కానీ ఇప్పుడు ఎరువులు అందుబాటులో లేవన్న మాట రాకుండా రిటైల్‌ డీలర్లు, సహకార సంఘాలకు సాధ్యమైనంత వరకు ఎరువులు సరఫరా చేస్తోంది. అత్యవసర సమయంలో లభ్యత కోసం మార్క్‌ఫెడ్‌లో బఫర్‌ స్టాక్‌ కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం నెలకొనగా, మరికొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు పడుతుండటంతో ప్రస్తుతం ఎరువుల అవసరం పెద్దగా రాలేదు. కానీ వానలు పడి, విత్తనాలు నాటుతున్న ప్రాంతాలు, కాలువల కింద ఆయకట్టులో వరి నారుమళ్లు పోస్తున్న రైతులకు ఎరువుల అవసరం ఏర్పడుతోంది.


కొన్ని జిల్లాల్లో ముమ్మరంగా కొనుగోళ్లు

ప్రస్తుతం కర్నూలు, శ్రీకాకుళం, మన్యం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎరువుల కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ జిల్లాల రైతులు ఎరువుల కోసం సహకార మార్కెటింగ్‌ సొసైటీకివెళ్తున్నారు. గత ప్రభుత్వంలో సహకార సంఘాలకు ఎరువులు పెద్దగా ఇవ్వకపోవడం, ఇప్పుడు సహకార సంఘాలకూ తగినన్ని ఎరువులు సరఫరా చేస్తుండటంతో రైతులు నేరుగా వెళ్లి తీసుకుంటున్నారు. ఈ సీజన్‌లో అన్ని రకాల పంటలకు కలిపి రాష్ట్రానికి 16.76లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఏప్రిల్‌ నాటికే 7.13లక్షల టన్నుల ప్రారంభనిల్వ ఉండగా, ఇప్పటి వరకు 6.56లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి. మొత్తం 13.70లక్షల టన్నుల లభ్యతలో 5.06లక్షల టన్నుల ఎరువులు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ప్రస్తుతం 8.64లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు ఆదివారం చెప్పారు.

డీలర్లకు ఉచిత రవాణా

యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ వంటి ఎరువులకు కొన్ని కంపెనీలు ఇతర ఉత్పత్తులతో లింక్‌ పెట్టి సరఫరా చేస్తుండటంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు రవాణా ఖర్చులు పెరిగి, మరోవైపు లింక్‌ ప్రొడక్ట్స్‌ అమ్ముడు పోక వ్యాపారులు నష్టపోతే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో యూరియా అమ్మలేమని రిటైల్‌ డీలర్లు చేతులెత్తేయడంతో అధికారులు స్పందించారు. ఎరువుల తయారీ కంపెనీలు, హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటైలర్లతో అధికారులు చర్చలు జరిపారు. ఫలితంగా రైల్వే గూడ్స్‌ ర్యాక్‌ పాయింట్ల నుంచి రిటైల్‌ డీలర్లకు ఉచితంగా లారీల్లో రవాణా చేసేందుకు పలు కంపెనీలు అంగీకరించాయి. కానీ ఎరువులు ఉచిత రవాణా అంశం జాతీయ స్థాయి విధానం అయినందున కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. కాగా, రాష్ట్రంలో ఎరువుల ర్యాక్‌ పాయింట్లు 22 ఉండగా, కొత్తగా అనకాపల్లిలో ఏర్పాటుకు డైరెక్టర్‌ డిల్లీరావు చొరవతో అనుమతి వచ్చింది. మదనపల్లి/ పీలేరు, హిందూపురం/పెనుగొండలో ర్యాక్‌ పాయింట్ల ఏర్పాటు అంశం కేంద్రం పరిశీలనలో ఉంది.


ఎరువుల లభ్యత.. ధరలు.. సబ్సిడీ

ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 50,838 లక్షల టన్నుల యూరియా కంపెనీల గోదాముల్లో ఉండగా, హోల్‌సేల్‌ డీలర్ల వద్ద 19,994 లక్షల టన్నులు, మార్క్‌ఫెడ్‌ వద్ద 81,494లక్షల టన్నులు, రిటైలర్ల వద్ద 1,02,473 టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 13,626లక్షల టన్నులు, సహకార సంఘాల్లో 27,582లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా 45కిలోల బస్తా రూ.2,270 కాగా, రూ.2,004 సబ్సిడీ పోను రూ.267 ఎమ్మార్పీగా ప్రభుత్వం నిర్ణయించింది. 50కిలోల డీఏపీ బస్తా రూ.3,772కాగా సబ్సిడీపై రూ.1,350కు, 50కిలోల కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా రూ.3,009 కాగా, సబ్సిడీపై రూ.1,400కు, 50కిలోల ఎంవోపీ రూ.2,409 కాగా రూ.1,700కు, 50కిలోల ఎస్‌ఎ్‌సపీ రూ.878 కాగా సబ్సిడీపై రూ.535కు అమ్మాలని వ్యవసాయశాఖ పేర్కొంది. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే.. కఠిన చర్యలుంటాయని డైరెక్టర్‌ డిల్లీరావు హెచ్చరించారు. కాగా, రాష్ట్రానికి కేటాయించే ఎరువులపై సబ్సిడీ కింద కేంద్రం ఏటా రూ.12 వేల కోట్లు భరిస్తోంది.

Updated Date - Jul 14 , 2025 | 03:44 AM