Engineering Counseling: మూడో వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:44 AM
ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
అందుబాటులో 2 లక్షలకుపైగా సీట్లు
ఇంకా తేలని ఫీజులు
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టులో తరగతులు ప్రారంభించేలా కౌన్సెలింగ్ తేదీలు నిర్ణయించనున్నారు. గతేడాది కూడా ముందే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో దాదాపు 30వేల అడ్మిషన్లు పెరిగాయి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం కూడా భారీగా పెరిగింది. దీంతో అడ్మిషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ ఏడాది ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,89,748 మంది అర్హత సాధించారు. గతేడాది రాష్ర్టానికి ఏఐసీటీఈ 1.81 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి అనుమతిచ్చింది.
ఈ ఏడాది ప్రైవేటు యూనివర్సిటీలు పెరగడంతో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 2లక్షలు దాటే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. మరోవైపు ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. గతంలో నిర్ణయించిన ఫీజులపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే ఫీజులు ఖరారు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఈ ఏడాది ఫీజులు నిర్ణయించాల్సి ఉంది.
9 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
డిప్లొమా నుంచి నేరుగా బీటెక్ రెండో ఏడాదిలో చేరే విద్యార్థుల కోసం ఈనెల 7న ఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేయనుంది. ఈనెల 9 నుంచి 22 వరకు మొదటి విడత, 30 నుంచి ఆగస్టు 4 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. జూలై 24 నుంచి రెండో ఏడాది ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయి.