Share News

Eisai Pharma: విశాఖలో ఇసాయ్‌ ఫార్మా జీసీసీ

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:57 AM

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ జీసీసీను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని ప్రముఖ ఫార్మా కంపెనీ ఇసాయ్‌ గ్లోబల్‌ సీఈవో మకోటో హోకెట్స్‌ ప్రకటించారు.

Eisai Pharma: విశాఖలో ఇసాయ్‌ ఫార్మా జీసీసీ

  • రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోంది

  • గీతంతో కలిసి పనిచేస్తాం: గ్లోబల్‌ సీఈవో

విశాఖపట్నం, జూలై 9(ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ)ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రాష్ట్రప్రభుత్వం సహకరిస్తోందని ప్రముఖ ఫార్మా కంపెనీ ఇసాయ్‌ గ్లోబల్‌ సీఈవో మకోటో హోకెట్స్‌ ప్రకటించారు. తమ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన బుధవారం గీతం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విశాఖ ఎంపీ, గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌, గీతం కార్యదర్శి భరద్వాజ, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎరోల్‌ డిసౌజా, ప్రొ-వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోకెట్స్‌ మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఔషధాల తయారీని విస్తృతం చేయడానికే విశాఖలో జీసీసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి అవసరమైన పరిశోధనలు, మానవ వనరుల సహకారానికి గీతం వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. శ్రీభరత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల విశాఖలో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, గూగుల్‌ వంటి సంస్థలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని.. ఇసాయ్‌ జీసీసీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. విశాఖలో ఫైజర్‌, దివీస్‌, లారస్‌ ల్యాబ్స్‌ వంటి సంస్థలకు అవసరమైన కోర్సులను తాము ఇప్పటివరకూ రూపకల్పన చేశామని వీసీ తెలిపారు. సమావేశంలో గీతం సీనియర్‌ ప్రొఫెసర్లు అరుణ్‌కుమార్‌, శాంతి, భరణి చంద్రకుమార్‌, ఐటీ విభాగం డైరెక్టర్‌ సాయిరామ్‌, ఇసాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, విశాఖ యూనిట్‌ అధిపతి గిరీశ్‌ దీక్షిత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 04:57 AM