Kakinada port : బెదిరించింది విక్రాంత్‌రెడ్డి!
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:36 AM
కాకినాడ సీపోర్టులో బలవంతపు వాటాల బదిలీ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి..
వాటాలు రాయకపోతే కుటుంబమంతా జైలుకు పోతారన్న వైవీ కుమారుడు!
ఈడీకి వెల్లడించిన కేవీ రావు
(కాకినాడ/హైదరాబాద్-ఆంధ్రజ్యోతి): కాకినాడ సీపోర్టులో బలవంతపు వాటాల బదిలీ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి.. నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో శరత్‌చంద్రారెడ్డిని ఇప్పటికే విచారించింది. తాజాగా ఈ కేసులో బాధితుడైన కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ (కేపీసీఎల్) చైర్మన్ కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు)ను బుధవారం హైదరాబాద్‌లో 8 గంటలకుపైగా ప్రశ్నించింది. అనేక కోణాల్లో 12 కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టింది. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తననెలా బెదిరించి వేధించారో.. వాటాలు కొట్టేశారో రావు వివరించారు. వాటాలకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలకు ఆధారాల గురించి ఈడీ ఆరా తీసింది. సదరు ఆధారాలతో పాటు బలవంతపు ఒప్పంద పత్రాలు, ఇతర ఫైళ్లను ఆయన అందజేశారు. మరింత లోతుగా ప్రశ్నించేందుకు మరోసారి రావలసి ఉంటుందని ఈడీ ఆయనకు తెలిపింది. తనకు కొద్దిగా సమయం కావాలని, వ్యక్తిగత పనులున్నాయని ఆయన బదులిచ్చారు. ఈలోపు ఈడీకి ఏ సమాచారం కావలసినా తన కార్యాలయ ప్రతినిధుల ద్వారా పంపుతానని తెలిపారు.
వాటాలు రాయాలంటూ ఎవరొచ్చారు..?
విచారణ సందర్భంగా.. కాకినాడ సీపోర్ట్స్‌లో మీకున్న వాటాలను బలవంతంగా ఎవరు రాయించుకున్నారని ఈడీ కేవీరావును ప్రశ్నించింది. ‘విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఎవరో మీకు తెలుసా.. మిమల్ని ఏయే రూపాల్లో బెదిరించారు’ అని ఆరా తీసింది. కేవీరావు ఎవరో తనకు తెలియదని విజయసాయిరెడ్డి ఇటీవల విచారణ సందర్భంగా చెప్పిన విషయాన్ని ఈడీ ప్రస్తావించింది. అది అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ‘అది ఎంతవరకు నిజం..? వాటాల విలువను తగ్గించేసి మీకు చెల్లించిన డబ్బును ఎవరు ఇచ్చారు..? ఎవరి పేరుతో మీ ఖాతాలకు ఆ డబ్బు బదిలీ అయింది.. ఆ డబ్బు ఎక్కడి నుంచి మీకు చేరింది..? సంతానం ఆడిట్ కంపెనీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన విషయం మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది..? సీపోర్టు, కాకినాడ సెజ్‌లలో మీ వాటాలను ఎవరు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించి రాయమంటే రాసిచ్చారు? ఈ రెండు కంపెనీల్లో మొత్తం మీ వాటాల విలువ ఎంత.. మీకు చెల్లించింది ఎంత’ అని ఈడీ అధికారులు అడిగారు. తనను బెదిరించి, భయపెట్టి, కుటుంబాన్ని జైలుకు పంపుతామని బెదిరించి వాటాలను బలవంతంగా రాయించుకున్నారని రావు సమాధానమిచ్చారు. తాను చెప్పిన అంశాలకు ఆధారాలు కూడా సమర్పించారు. సీపోర్టు, సెజ్‌లో వాటాలు రాసివ్వాలంటూ మిమ్మల్ని ఎవరు కలిశారని ఈడీ ప్రశ్నించింది. ‘జగన్ సీఎం అయిన కొన్ని నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు.. చెన్నైకి చెందిన సంతానం కంపెనీతో సీపోర్టులో జరిగిన వ్యాపార లావాదేవీలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని సమాచారం వచ్చింది. ఆ తర్వాత ముంబైకు చెందిన మరో కంపెనీతోను ఆడిట్ అని చెప్పారు. ఏ తప్పిదాలూ లేకుండా పక్కాగా పన్నులు చెల్లిస్తూ సజావుగా జరుగుతున్న వ్యాపారంపై ఇలా జరుగుతుండడంతో నాకు అనుమానం వచ్చింది. అయినా సహకరించి.. అడిగిన ఫైళ్లన్నీ ఇచ్చాం. కేఎ్‌సపీఎల్ రాష్ట్రప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు నివేదికలో తేల్చి పథకం ప్రకారం వాటాలపై కన్నేశారు. అదే సమయంలో నాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని కలవమన్నారు’ అని వెల్లడించారు.
జగన్ ఆదేశమంటూ విక్రాంత్‌రెడ్డి భయపెట్టారు!
ఇటీవల విచారణ సందర్భంగా తనకు కేవీ రావు ఎవరో తెలియదని విజయసాయిరెడ్డి తమకు చెప్పిన విషయాన్ని ఈడీ అధికారి ప్రస్తావించగా.. అదంతా అబద్ధమని రావు బదులిచ్చారు. ‘విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత విక్రాంత్‌రెడ్డి ఇంటికి వెళ్తే.. ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఎగ్గొట్టానంటూ నివేదిక చూపించారు. కుటుంబమంతా జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని, అలా జరగకూడదంటే కేఎ్‌సపీఎల్‌లో వాటాలన్నీ తమకు రాసిచ్చేయాలని ఆయన బెదిరించారు. నేనే తప్పూ చేయలేదని చెప్పినా ఇది సీఎం జగన్ ఆదేశమని విక్రాంత్ భయపెట్టారు జగన్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించినా.. ఇదంతా నడిపించింది ఆయనే కావడంతో.. నా మాట వినిపించుకోరని అర్థమైంది. చేసేదిలేక 2020 జూలైలో వాటాల మార్పిడిపై సంతకం చేశా’నని కేవీరావు తెలిపారు.
జైలుకు పంపుతామన్నారు..!
కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో మీ వాటాను బెదిరించి లాగేసుకుంది ఎవరు.. విక్రాంత్‌రెడ్డితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా.. వాటాలు ఎలా లాక్కున్నారని ఈడీ కేవీ రావును ప్రశ్నించింది. ఇక్కడ కూడా విక్రాంత్‌రెడ్డి తనను జైలుకు పంపుతానని బెదిరించినట్లు ఆయన తెలిపారు. వాటాలు రాయించుకునేటప్పుడు ఎవరెవరు హాజరయ్యారని అడుగగా.. విక్రాంత్‌రెడ్డి బెదిరించి అరబిందో ప్రతినిధుల సమక్షంలో వాటాలు కొట్టేశారని చెప్పారు.