ఫిబ్రవరి 4 నుంచి అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:14 AM
అమలాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాస్థాయి అధికారులతో కల్యాణోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు కల్యా
అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధం కావాలి
ముందస్తు ఏర్పాట్లపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ సమీక్ష
అమలాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాస్థాయి అధికారులతో కల్యాణోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు. 4న రథసప్తమి నుంచి కల్యాణోత్సవాలు ప్రారంభమై 10 రోజుల పాటు గ్రామోత్సవం, స్వామివారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. 5వ తేదీన గరుడ పుష్పక వాహనంపై మాడవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం, 6న హంస వాహనం, 7న గజమాల అలంకరణ కార్యక్రమం అనంతరం రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు స్వామివారి తిరు కల్యాణోత్సవం, భద్రాద్రి రాములోరి కల్యాణం మాదిరిగా ఆరుబయట ప్రాంగణంలో వైభవంగా జరుగుతుందన్నారు. అనంతరం భక్తులు శిఖర దర్శనం చేసుకుంటారని ఆయన తెలిపారు.
12ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు
స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా 12ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా కవరేజ్ కోసం ప్రత్యేక కంపార్టుమెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయంలో వీఐపీ, శీఘ్ర సాధారణ దర్శనాల కోసం మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 8న అక్షింతల సేకరణ పంపిణీ కార్యక్రమాలు, స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 9, 10, 11 తేదీల్లో స్వామివారి గ్రామోత్సవాలు, దర్శన కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. 12న స్వామివారి చక్రవారీ సముద్రస్నానం, ఉదయం 8 గంటల నుంచి సంప్రోక్షణ, స్వామి అర్చన కార్యక్రమాలు, వేద పురోహితులు నిర్వహిస్తారు. 13న నదీ విహారంలో మూడు రౌండ్లుగా తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తారు. ఆర్టీసీ అధికారులు భక్తుల సౌకర్యార్థం దేవాలయం వరకు బస్సులు నడిపే అవకాశాలపై ప్రాథమిక సర్వే నిర్వహించాలని ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ అధికారులకు సూచించారు. స్నానఘట్టాల వద్ద భక్తుల భద్రత కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో నాలుగు రెస్క్యూ బోట్లు, వంద మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక పోలీసులు మెరైన్ పోలీసులను సమన్వయం చేసుకుని భక్తుల శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు దేవస్థానం బయట బారీకేడింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు అంతర్గత రోడ్లు నిర్మాణం, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి కంట్రోల్ రూముకు అనుసంధానం చేయాలని కలెక్టర్ తెలిపారు.
నిరంతరం విద్యుత్ సరఫరా
పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, లైటింగ్‌ను భక్తులు సంచరించే రహదారి పొడవునా ఏర్పాటు చేయాలన్నారు. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూము నుంచి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు 60 తాత్కాళిక మరుగుదొడ్లతో పాటు తాగునీటి వసతి సౌకర్యాలు సమృద్ధిగా కల్పించాలన్నారు. డీపీవో ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను నియమించి సంపూర్ణ పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. రథోత్సవానికి వీలుగా మాఢవీధుల్లో తొలగించిన విద్యుత్ వైర్లను రథోత్సవం ముగిసిన తరువాత తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐదు ప్రాథమిక వైద్య శిబిరాలు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. అబ్కారీ అధికారులు పది రోజుల పాటు మద్యం షాపులను మూసివేయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ స్వామివారి కల్యాణం, తెప్పోత్సవం, సముద్ర స్నానఘట్టాల ప్రక్రియల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా అధికారులంతా పూర్తి సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటాయన్నారు. డీఐపీఆర్వో నేతృత్వంలో ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ద్వారా ఉత్సవాల కవరేజ్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో కె.మాధవి, అదనపు ఎస్పీ ప్రసాద్, డీఎస్పీ,జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.