Share News

Minister Narayana: విద్యా శాఖలో అనేక తప్పిదాలు చేసిన గత ప్రభుత్వం

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:36 PM

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యా శాఖలో అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి నారాయణ గుర్తు చేశారు. అయితే వాటన్నిటిని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన వివరించారు.

Minister Narayana: విద్యా శాఖలో అనేక తప్పిదాలు చేసిన గత ప్రభుత్వం
AP MInister P Narayana

కాకినాడ, జూన్ 09: కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నామని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. కాకినాడలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో షైనీ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యాశాఖలో అనేక తప్పిదాలు చేసిందని విమర్శించారు. 2014 - 19 మధ్య తాను మంత్రిగా ఉన్న సమయంలో 2 వేల మున్సిపల్ స్కూల్స్‌లో కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చామని వివరించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో వాటన్నింటినీ రద్దు చేసిందని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల కంటే బెస్ట్ టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోనే ఉంటారన్నారు. ఎందుకంటే.. గవర్నమెంట్ పరీక్షల్లో సెలెక్ట్ కాని వారు ప్రైవేట్ స్కూళ్లకు టీచర్లుగా వెళ్తారని ఆయన వివరించారు.


చదువులకు పేదరికం అడ్డు కాకూడదనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మా నాన్నగారు బస్సు కండక్టర్‌గా పని చేశారని.. ఆయన కేవలం 8వ తరగతి వరకూ మాత్రమే చదువుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నారాయణ గుర్తు చేసుకున్నారు. తాను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనేనని ఆయన వివరించారు. హార్డ్ వర్క్ చేసి మంచి ప్రణాళికతో చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆయన తెలిపారు.


ఇదే విధానాన్ని మా నారాయణ విద్యా సంస్థల్లో ఫాలో అవుతున్నామన్నారు. మా నారాయణ విద్య సంస్థల్లో 6 లక్షల మంది విద్యార్ధులు ఉన్నారు. 60 వేల మంది డైరెక్ట్ ఉద్యోగులు, మరో 60 వేల మంది ఇండైరెక్ట్ ఉద్యోగులున్నారని చెప్పారు. అయితే 2008 వరకూ ఉమ్మడి ఏపీకి ఐఐటీ ర్యాంకులు వచ్చేవి కావన్నారు. కానీ ఆ తర్వాత మొదటిసారి నారాయణ విద్యార్ధికి దేశవ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని పేర్కొన్నారు. కష్టపడి చదవండి.. అనుకున్న లక్ష్యం సాధించుకోవాలని విద్యార్థులకు మంత్రి నారాయణ సూచించారు.


కాకినాడ జిల్లాలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 132 మంది, ఇంటర్‌లో 36 మంది విద్యార్థుకలకు అవార్డులను మంత్రి నారాయణ ప్రదానం చేశారు. ఒక్కొక్క విద్యార్థికి రూ. 20 వేల నగదు, ప్రశంసా పత్రం, మెడల్‌ను మంత్రి నారాయణ అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఉన్నతాధికారులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

Updated Date - Jun 09 , 2025 | 04:38 PM