భయమొంథా!
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:21 AM
కాకినాడ వైపు మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ప్రచండ వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తోంది. కాకినాడ పోర్టు - తుని మధ్య మంగళవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది.
దూసుకొస్తున్న తుఫాన్
మంగళవారం అర్థరాత్రి నుంచి తీవ్రత
కాకినాడ పోర్టు-తుని మధ్య తీరం దాటే అవకాశం
ఆ సమయంలో గంటకు 100కి.మీ వేగంతో గాలులు
మూడు రోజులు రెడ్ అలర్ట్ - కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు
పోర్టులో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక
తూర్పున స్కూళ్లకు సోమ, మంగళవారం సెలవులు
ఆది, సోమవారాలు కాకినాడ బీచ్ మూసివేత
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాకినాడ వైపు మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ప్రచండ వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తోంది. కాకినాడ పోర్టు - తుని మధ్య మంగళవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది.
కాకినాడ, కోనసీమల్లో హైఅలెర్ట్
కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలు, జలవనరులశాఖ, ట్రాన్స్‌కో కం ట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశాయి. మూడు జిల్లాల కలె క్టర్లు తుఫాన్ సన్నాహక చర్యలపై వివిధ శాఖల అధి కారులతో శనివారం సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో సోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవులు ప్రక టించారు. కాకినాడ బీచ్‌ను ఆదివారం, సోమవారాలు మూసివేస్తామని ప్రకటించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని తీర ప్రాంత మండలాల్లో హైఅలర్ట్ జారీ చే శారు. ఈ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రక టిం చాల్సి ఉంది. పెనుగాలుల ధాటికి విద్యుత్‌కు అంతరా యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏలేరు రిజర్వాయరులో ముందుగానే నీటిని విడుదల చేయడంతో పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశా రు. తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ జిల్లాపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ వర్షాలు కురిసే ప్రమా దం ఉందన్న హెచ్చరికలతో గ్రామ స్థాయిలో సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కార్యాచరణ రూపొందించారు. తుఫాన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యావసరాలను తగిన ప్రదేశాల్లో ఉంచేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెలికం ఆపరేటర్లు సమన్వయంతో మొబైల్ టవర్ల వద్ద జనరేటర్ల్లు ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ సేవల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలకు ఆదేశించారు.
థాయ్‌లాండ్ పేరు పెడితే ఇంతే..
1992 నుంచి ఇప్పటివరకు కాకినాడలో నాలుగు తుఫాన్లు తీరం దాటాయి. 1992లో నవంబరు 6న కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటిన సమయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నష్టం సంభ వించింది. 1996 నవంబరు 6న కాకినాడలో తుఫాన్ తీరం దాటిన సమ యంలో భారీ గాలులు తీవ్ర నష్టం తెచ్చిపెట్టాయి. 2000లో తుఫాన్లకు పేర్లు పెట్టడం అమల్లోకి వచ్చింది. 2018 డిసెంబర్ 13 నుంచి 18 మధ్య పెథాయ్ తుఫాన్ కాకినాడ-యానాం మధ్యలో తీరం దాటింది. ఈ తుఫాన్‌కు అప్పట్లో థాయ్‌లాండ్ పేరు సూచించింది. ఆ తర్వాత 2020 అక్టోబరు 13న కాకి నాడలో ఓ మోస్తరు తుఫాన్ తీరం దాటింది. మళ్లీ ఇప్పుడు తీవ్ర తుఫాను ఏడేళ్ల తర్వాత కాకినాడలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్‌కు మొంథాగా థాయ్‌లాండ్ దేశం నామకరణం చేసింది. థాయ్‌భాషలో మొంథా అంటే సువాసన వెదజల్లే పుష్పం. ఒకరకంగా చెప్పాలంటే థాయ్‌లాండ్ తుఫాన్లకు పేర్లు పెడితే కాకినాడకు మూడినట్టేనన్న చర్చ జరుగుతోంది. గతంలో పెథాయ్ తుఫాన్ కాకినాడలో తీరం దాటిన సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల మధ్య వేగంతో గాలులు వీచాయి. అత్యధికంగా తాళ్లరేవు మండలంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నౌకలన్నీ సముద్రంలోకే...
తుఫాన్ కాకినాడ పోర్టు- తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుండడంతో కాకి నాడ యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు అప్రమత్త మయ్యాయి. సోమవారం నుంచి మూడు రోజులు అన్ని కార్గో ఎగుమతి, దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డీప్‌వాటర్ పోర్టులో 19, యాంకరేజ్‌పోర్టులో ఆరు నౌకలు కార్గో కోసం లంగరు వేశాయి. వీటిని సోమవారం మధ్యాహ్నం తీరం నుం చి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించనున్నారు. పోర్టులో సోమవారం నుంచి ఐదో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. గడచిన ఏడేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వివరించారు.
అప్రమత్తంగా ఉండండి : పవన్
పిఠాపురం,అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండా లని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగలి షాన్‌మోహన్, ఇతర అధి కారులతో శనివారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరప్రాంతం ఉన్న పిఠాపురం, తుని, కాకినాడ రూరల్, సిటీ నియోజకవర్గాలతోపాటు తాళ్లరేవు మండలంపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని వాతావరణశాఖ వేసిన అంచనాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. తీరం వెంబడి ఉన్న గ్రామాల్లోని ప్రజలు సురక్షితం గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
వస్తానన్న పవన్.. వద్దన్న కలెక్టర్
తుఫాన్ ప్రభావం సమాచారంతో కాకినాడ జిల్లాకు వస్తానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కలెక్టర్ షాన్‌మోహన్‌కు తెలియజేశారు. అధికారయంత్రాంగం అంతా తుఫాన్ ఎదుర్కొనే సన్నద్ధతలో ఉందని.. ఇటువంటి సమయంలో జిల్లా పర్యటన వద్దని కలెక్టర్ సూచించారు. దీంతో పవన్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
కాకినాడకు 900 కి.మీ
ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం సాయంత్రం నాటికి గంటకు ఏడు కిలో మీటర్ల వేగంతో వాయు గుండంగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయు గుండంగా, సోమవారం నాటికి తుఫాన్‌గా, మంగళవారం నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. ప్రస్తుతానికి పోర్టు బ్లెయిర్‌కు 440 కి.మీ, విశాఖకు 970 కి.మీ, కాకినాడకు 900 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మంగళ వారం అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్ కాకినాడలో తీరం దాట నున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమ యంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. అటు తుఫా న్ తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 20 సెంటీ మీట ర్ల మేర కుంభవృష్టిగా వానలు కురవనున్నాయి.