Crime : డీపీ.. కూపీ..!
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:12 AM
నగరశివారు ప్రాంతం. వేకువజాము. పొలం గట్టు. ప్రశాంత వాతావరణం. ఉన్నఫలంగా మర్డర్ వార్త. అటు పోలీసులు, ఇటు పల్లె జనాల్లో అలజడి. శరీరంపై పోట్లు, ఛిద్రమైన తలభాగం. రక్తపు మడుగులో మృతదేహం. ఇదీ జూన 25వ తేదీ రూరల్ మండలం అక్కంపల్లి...
వాట్సాప్ డీపీతో హత్య కేసు ఛేదింపు
ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు
కీలక ఆధారంగా వాట్సాప్ డీపీ
గంటల్లోనే నిందితుల అరెస్ట్
అనంతపురం క్రైం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నగరశివారు ప్రాంతం. వేకువజాము. పొలం గట్టు. ప్రశాంత వాతావరణం. ఉన్నఫలంగా మర్డర్ వార్త. అటు పోలీసులు, ఇటు పల్లె జనాల్లో అలజడి. శరీరంపై పోట్లు, ఛిద్రమైన తలభాగం. రక్తపు మడుగులో మృతదేహం. ఇదీ జూన 25వ తేదీ రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీలోని సదాశివ కాలనీ ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు. ఈ ఉదంతంతో అనంతపురం రూరల్ డీఎస్పీ నుంచి రూరల సీఐ, ఎస్‌ఐ వరకూ అందరూ పరుగులందుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి ఆరు గంటల్లో
నిందితుల ను పట్టుకొచ్చారు. ఈ హత్య కేసు ఛేదింపు వెనుక ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ఒక హత్య, రెండు బొమ్మలు, 30 కిలోమీటర్ల ప్రయాణం ఇవీ హత్య కేసులో కీలక మలుపులు.
వాట్సాప్ డీపీతో..
రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీలోని సదాశివ కాలనీలో ఉంటున్న సురేష్ బాబు(43)ను గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఏడాది జూన 25 హత్య చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరుగంటల్లోనే నిందితులను పట్టుకొచ్చారు. అయితే ఈ హత్య కేసు ఛేదింపులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దర్యాప్తులో భాగంగా అనంతపురం రూరల్ పోలీసులు సదాశివ కాలనీలో మృతుడి భార్య, స్థానికులను ఆరా తీసి కొంత సమాచారం రాబట్టారు. హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించారు. మృతుడి భార్య అనితను గట్టిగా ప్రశ్నించారు. ఆమె ప్రియుడు బాబా ఫకృద్దీన(37) ఈ హత్య చేసినట్లుగా అనుమానిం చారు. పోలీసులు అతడి సెల్ ఫోన నంబర్ ద్వారా వాట్సాప్ డీపీ చూశారు. డీపీపై ఏబీ అనే ఆంగ్ల అక్షరాలు లవ్ సింబల్‌తో ముడిపడి ఉండటం గుర్తించిన పోలీసులకు విషయం మొత్తం అర్థం అయ్యింది. మృతుడి భార్య పేరు అనిత, ఆమె ప్రియుడి పేరు బాబా ఫకృద్దీన కావడంతో ఇద్దరి పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలు ఏబీ వచ్చేలా లవ్ సింబల్ రూపొందించారని ధ్రువీకరించుకున్నారు. తర్వాత ఆ నెంబర్‌ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగింది.
సిగ్నల్ ఆధారంగా 30 కిలోమీటర్ల ప్రయాణం
సెల్‌ఫోన సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకోడానికి పోలీసులు 30 కిలోమీటర్లు ప్రయాణం మొదలెట్టారు. అనంతపురం నుంచి కూడేరు మీదుగా కరుట్లపల్లికి చేరుకున్నారు. అక్కడ ఓ కాలనీ వైపు అడుగేశారు. వాళ్లు వెళ్లిన ప్రాంతంలోనే ఒక ఆటో నిలిచి ఉంది. ఆ ఆటోపై కూడా వాట్సాప్ డీపీలో ఉన్న ఫొటోనే ఉండటంతో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఆటోకు సమీపంలోని ఇంట్లోకి వెళ్లి వెతికారు. అక్కడే ఉన్న నిందితుడికి గట్టిగా కౌన్సెలింగ్ ఇవ్వడంతో మొత్తం కక్కేశాడు. మృతుడు సురేష్ భార్యతో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు. ఆమె చెప్పడంతోనే 24న రాత్రి 11 గంటలప్పుడు ఇంటికి వెళ్తున సురే్‌షపై అక్కంపల్లి- రాచానపల్లి మధ్యలో నల్లలమ్మ గుడి సమీపంలో ఖాళీ సీసాతో అటాక్ చేశానన్నాడు. తర్వాత తన వెంట తెచ్చుకున్ని స్ర్కూడ్రైవర్‌తో పొడిచి, తర్వాత బండ రాయితో కొట్టి చంపి పరారైనట్లు పోలీసులకు వివరించాడు. ఈ కేసు దర్యాప్తు వాట్సప్ డీపీతో మొదలై...అదే బొమ్మతోనే ముగిసింది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కే ఈ కాలంలో చిన్న క్లూ దొరికినా కొండను తవ్వైనా పోలీసులు నేరస్థులను పట్టేస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ.