High Court: యాజమాన్యాల తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టొద్దు
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:11 AM
డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడానికి వీల్లేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) రిజిస్ట్రార్‌కు హైకోర్టు తేల్చిచెప్పింది. అఫిలియేషన్, ఇతర ఫీజులు చెల్లించని కాలేజీ యాజమాన్యాలపై ఎలాంటి కఠినచర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదంది.
ఫలితాలు వెల్లడించాల్సిందే.. ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు స్పష్టం
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడానికి వీల్లేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) రిజిస్ట్రార్‌కు హైకోర్టు తేల్చిచెప్పింది. అఫిలియేషన్, ఇతర ఫీజులు చెల్లించని కాలేజీ యాజమాన్యాలపై ఎలాంటి కఠినచర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదంది. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, 2022-25 బ్యాచ్ 6వ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను వెల్లడించాల్సిందేనని తేల్చిచెప్పింది. కాలేజీ యాజమాన్యాల నుంచి సొమ్మును రాబట్టుకొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలంది.
రిజిస్ట్రార్‌తో మాట్లాడి సమస్యకు తగిన పరిష్కారం కనుగొనాలని ఏజీకి సూచిస్తూ విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణకు హాజరు నుంచిరిజిస్ట్రార్‌కు మినహాయింపు ఇచ్చారు. తమ కాలేజీల 2022-25 బ్యాచ్ 6వ సెమిస్టర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఏఎన్‌యూ వెల్లడించకపోవడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన మహాత్మా గాంధీ కాలేజీ, ప్రకాశం జిల్లాకు చెందిన కార్తికేయ డిగ్రీ కాలేజీ, మరికొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు వేసిన వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు వర్సిటీ రిజిస్ట్రార్ కోర్టు ముందు హాజరయ్యారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఈ యాజమాన్యాలు అఫిలియేషన్ ఫీజు చెల్లిస్తే వెంటనే విద్యార్థుల ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కాలేజీ యాజమాన్యాల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారని, ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్, ఇతర సొమ్ము అందకపోవడంతో అఫిలియేషన్ ఫీజు చెల్లించలేకపోయామన్నారు. ఏజీ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్‌వేస్తామని చెప్పగా న్యాయమూర్తి అంగీకరించారు.