Digital Locker : మొబైల్ ఫోన్‌లోనే అన్ని ధ్రువపత్రాలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:39 AM
తమ ఫోన్లలోనే అన్ని పత్రాలనూ డిజిటల్ రూపేణా పొందుపర్చుకోవచ్చు. అందుకు వీలుగా డిజి లాకర్ సౌకర్యానికి ప్రభుత్వ

ఆర్టీజీఎస్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘భవిష్యత్‌లో పౌరులు తమ ధ్రువీకరణ పత్రాలను వేటినీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. తమ ఫోన్లలోనే అన్ని పత్రాలనూ డిజిటల్ రూపేణా పొందుపర్చుకోవచ్చు. అందుకు వీలుగా డిజి లాకర్ సౌకర్యానికి ప్రభుత్వ సేవలన్నింటినీ అనుసంధానం చేస్తాం’ అని ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల అనుసంధానం ప్రక్రియపై అన్ని శాఖల, విభాగ అధిపతులతో శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ... ‘‘ఆర్టీజీఎస్ ఒక పెద్ద ‘డేటా లేక్’ను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని ఈ డేటా లేక్‌తో అనుసంధానం చేస్తాం. తద్వారా పౌరులకు డిజిటల్ సేవలను మరింత మెరుగ్గా అందించడానికి వీలవుతుంది. పౌరులకు అవసరమైన సేవలను అందించడమే కాకుండా చెల్లింపులు కూడా వాట్సప్ ద్వారా చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాం. వాట్సప్ గవర్నెన్స్‌ను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందిస్తున్నాం. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రజల సౌకర్యార్థం తమిళం, ఒరియా, కన్నడ భాషల్లో కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి శాఖలోనూ ఒక ‘చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్’ (సీడీటీఓ)ను నియమించుకోవాలి. తమ వద్ద ఉన్న డేటాను ఆర్టీజీఎస్లోని డేటా లేక్‌తో పంచుకొనే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలి’’ అని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్‌టీజీఎస్ సీఈవో దినేశ్‌కుమార్, డిప్యూటీ సీఈవో మాధురి తదితరులు పాల్గొన్నారు.