DGP Hari Krishna Gupta : గంజాయిపై ఉక్కుపాదం!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:35 AM
మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా స్పష్టం చేశారు.
అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టిస్తున్నాం: డీజీపీ
యడ్లపాడు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి):మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయిని శనివారం పల్నాడు జిల్లాలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాంటులో దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈగిల్ ఐజీ ఆకె రవికృష్ణతో కలసి డీజీపీ పరిశీలించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయిరవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ఈగిల్ సంస్థ ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖలతోపాటు, ఈగిల్ సంస్థ సహకారంతో అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టిస్తున్నా మన్నారు. గతంలో రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలు పెద్ద ఎత్తున జరిగేవని, ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో గంజాయి సాగుతగ్గిందని చెప్పారు. అయితే, ఒడిసా నుంచి పెద్ద ఎత్తున రవాణా అవుతోందని, ఇతర రాష్ట్రాలకు సైతం మన రాష్ట్రం ద్వారానే రవాణా జరుగుతోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో కలసి సమన్వయంతో పనిచేసి గ్యాంగ్‌లను పట్టుకుంటున్నామన్నారు. అలా ఇప్పటి వరకు లక్ష కేజీల గంజాయిని సీజ్ చేసి, అందులో 70 వేల కేజీల గంజాయిని దహనం చేసినట్టు చెప్పారు. 183 కేసులకు సంబంధించి పట్టుబడిన రూ.1.87కోట్ల విలువైన 3,737 కేజీల గంజాయి, 4.22 కేజీల లిక్విఫైడ్ గంజాయిని జిందాల్ పవర్ ప్లాంటులో శనివారం దహనం చేసినట్లు వివరించారు.