Share News

NEP 2020: భాషా వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..

ABN , Publish Date - Mar 15 , 2025 | 07:28 PM

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. భాషా వివాదంపై స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. హిందీని తానెప్పుడూ వ్యతిరేకించలేదన్న పవన్.. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి..

NEP 2020: భాషా వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
Deputy CM Pawan Kalyan

అమరావతి, మార్చి 15: భాషా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన పవన్.. ఒక భాషను బలవంతంగా విధించడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ రెండూ భారత జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవన్నారు. హిందీని ఒక భాషగా తానెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు పవన్. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ 220 హిందీని అమలు చేయనప్పుడు.. దాని విధింపు గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ఎందుకు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇలా చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు.


నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ ప్రకారం.. విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏదైనా రెండు భారతీయ భాషలను(తమ మాతృభాషతో సహా) నేర్చుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటారన్నారు. హిందీ వద్దనుకుంటే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలీ, మైతేయి, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా మరే ఇతర భారతీయ భాషనైనా ఎంచుకోవచ్చన్నవారు. బహుళ-భాషా విధానం ఎంపికతో విద్యార్థులను ప్రోత్సహించడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశం గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడడానికి ఉపకరిస్తుందన్నారు. రాజకీయ ఎజెండాల కోసం నూతన విద్యా విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, పవన్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం సదరు వ్యక్తుల అవగాహనా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని విమర్శించారు. జనసేన పార్టీ ప్రతి భారతీయునికి భాషాపరమైన స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Updated Date - Mar 15 , 2025 | 07:28 PM