Share News

UG Degree Guidelines: డిగ్రీ మారింది

ABN , Publish Date - May 30 , 2025 | 04:31 AM

డిగ్రీ కోర్సుల నిర్మాణం మారింది. రెండు మేజర్‌లు, ఒక మైనర్‌ సబ్జెక్టులతో 3 లేదా 4 ఏళ్ల డిగ్రీలు అందించబడతాయి, కంప్యూటర్స్‌లో క్వాంటమ్‌ టెక్నాలజీ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ల గుర్తింపు పదేళ్లకు పొడిగించబడింది.

UG Degree Guidelines: డిగ్రీ మారింది

  • కంప్యూటర్స్‌లో ‘క్వాంటమ్‌’ తప్పనిసరి

  • రెండు మేజర్‌ సబ్జెక్టులు, ఒక మైనర్‌

  • మూడేళ్ల డిగ్రీకి 150, నాలుగేళ్లకు 194 క్రెడిట్లు

  • మధ్యలో ఆపితే అక్కడివరకు సర్టిఫికెట్‌

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల స్వరూపం మారింది. సింగిల్‌ మేజర్‌ డిగ్రీని టు మేజర్‌గా (డ్యూయల్‌ మేజర్‌)గా మారుస్తూ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీచేసింది. తాజాగా కోర్సులు ఎలా ఉండాలనేదానిపై సవివర మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త విధానంలో రెండు మేజర్‌ సబ్జెక్టులు, ఒక మైనర్‌ సబ్జెక్టును విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఉన్నట్టుగానే విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ చదవొచ్చు. ఫస్టియర్‌, సెకెండియర్‌ తర్వాత కూడా మధ్యలోనే ఆపేసే వెసులుబాటు ఉంటుంది. టు మేజర్‌ డిగ్రీలో మూడేళ్లకు.. మొదటి మేజర్‌ సబ్జెక్టుకు 48 క్రెడిట్లు, రెండో మేజర్‌ సబ్జెక్టుకు 32 క్రెడిట్లు, మైనర్‌ సబ్జెక్టుకు 16 క్రెడిట్లు ఇస్తారు. భాషా సబ్జెక్టులకు 18, నైపుణ్య మెరుగుదల కోర్సులకు 12, మల్టీ డిసిప్లీనరీ కోర్సులకు 6, వాల్యూ యాడెడ్‌ కోర్సులకు 2, కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టుకు 4, స్వల్పకాలిక ఇంటర్న్‌షి్‌పకు 4, దీర్ఘకాలిక ఇంటర్న్‌షి్‌పకు 8 క్రెడిట్లు ఇస్తారు. మూడేళ్ల డిగ్రీ మొత్తం 150 క్రెడిట్లతో పూర్తవుతుంది. అదే విద్యార్థి నాలుగో ఏడాది ఆనర్స్‌ డిగ్రీ కూడా పూర్తిచేస్తే మరో 44 క్రెడిట్లు కలిసి మొత్తం 194 అవుతాయు. విద్యార్థి రెండు మేజర్‌ సబ్జెక్టులను మొదటి సెమిస్టర్‌లోనే ఎంపిక చేసుకోవాలి. మూడో సెమిస్టర్‌ సమయంలో మైనర్‌ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. ఏఐ, డేటా మైనింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సుల విద్యార్థులు తప్పనిసరిగా క్వాంటమ్‌ టెక్నాలజీపై మైనర్‌ చదవాలి. డిగ్రీలో చేరిన మొదటి సంవత్సరం తర్వాత ఆపేస్తే లెవెల్‌ 4.5తో సర్టిఫికెట్‌ జారీచేస్తారు. రెండో సంవత్సరం తర్వాత ఆపేస్తే వారికి లెవెల్‌ 5తో డిప్లొమా సర్టిఫికెట్‌ ఇస్తారు. మూడేళ్లు చదివితే లెవెల్‌ 5.5తో డిగ్రీ వస్తుంది. నాలుగేళ్లు చదివితే ఆనర్స్‌ డిగ్రీ ఇస్తారు. నాలుగో సంవత్సరం రిసెర్చ్‌ మెథడాలజీలో చదివితే ఆనర్స్‌తో పాటు రిసెర్చ్‌ డిగ్రీ వస్తుంది.


స్కూళ్ల గుర్తింపు పదేళ్లకు పెంపు

హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్‌

ప్రైవేటు పాఠశాలల గుర్తింపును ఎనిమిది నుంచి పదేళ్లకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పదేళ్ల గుర్తింపు ఉండగా వైసీపీ ప్రభుత్వం దానిని మూడేళ్లకు తగ్గించింది. తాము అధికారంలోకి వస్తే మళ్లీ పదేళ్లు చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. దీంతో ఎన్నికలకు ముందు వైసీపీ సర్కారు ఎనిమిదేళ్లకు పెంచింది. కాగా, ఎన్నికలు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల గుర్తింపును పదేళ్లకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - May 30 , 2025 | 04:33 AM