Diwali: ‘దీపావళి’.. ఈ పేరుతో ఓ ఊరుంది..
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:38 PM
‘దసరా’, ‘దీపావళి’ పండగలని తెలుసు. దేశవ్యాప్తంగా కొన్ని ఊర్ల పేర్లు గమ్మత్తుగా ఉన్నట్టే... ఆశ్చర్యంగా ఒక ఊరి పేరు ‘దీపావళి’. అది కూడా ఎక్కడో కాదు... మన దగ్గరే. దేశవ్యాప్తంగా ఈ పేరుతో ఉన్న ఒకే ఒక్క ఊరు అది... ఇంతకీ ఎక్కడుంది? ఏమా కథ??
‘దసరా’, ‘దీపావళి’ పండగలని తెలుసు. దేశవ్యాప్తంగా కొన్ని ఊర్ల పేర్లు గమ్మత్తుగా ఉన్నట్టే... ఆశ్చర్యంగా ఒక ఊరి పేరు ‘దీపావళి’. అది కూడా ఎక్కడో కాదు... మన దగ్గరే. దేశవ్యాప్తంగా ఈ పేరుతో ఉన్న ఒకే ఒక్క ఊరు అది... ఇంతకీ ఎక్కడుంది? ఏమా కథ??
భారతదేశంలోనే ‘దీపావళి’ అని పిలిచే ఒకే ఒక్క గ్రామం... శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలోని గార మండలం, గొంటి మేజర్ పంచాయితీలో ఉంది. ఆ ఊరి జనాభా 1,181. అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తారు. వంశధార, నాగావళి నదుల నుంచి సాగునీరు అందుబాటులో ఉండటం వల్ల అన్ని రకాల పంటలు పుష్కలంగా పండిస్తారు.
పేరు వెనుక పురాణగాథ...
‘‘ఈ గ్రామం పేరు వెనుక గొప్ప పురాణం ఉంది. శతాబ్దాల క్రితం... ఈ ప్రాంతాన్ని పాలించిన సిక్కోలు రాజు అత్యంత భక్తిపరుడు. ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ప్రతీ ఉదయం గుర్రం మీద శ్రీకాకుళం నుండి శ్రీకూర్మం మీదుగా కళింగ పట్నం వెళ్లి తిరిగి వస్తుండేవాడు. ఆ క్రమంలో ఒకరోజు ఈ ప్రాంతంలోని పవిత్రమైన శ్రీ కూర్మనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా... మా
గ్రామంలో చీకటిపడుతున్న వేళ స్పృహ తప్పి పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడి రైతు కూలీలు, భక్తులు వచ్చి... నూనె దీపాలతో ఆయన చుట్టు చేరి, సపర్యలు చేసి, మంచినీళ్లు ముఖంపై చిలకరించడంతో రాజు స్పృహలోకి వచ్చి, లేచి కూర్చున్నాడు. తన కోసం ప్రజలు చూపిన అభిమానానికి ఆయన పొంగిపోయాడు. అందుకు కృతజ్ఞతగా, రాజు ఇలా ప్రకటించాడు, ‘మీరు దీపాల వెలుగులో నాకు ఊపిరి పోశారు. ఈ రోజు నుంచి మీ గ్రామాన్ని దీపావళి అని పిలుచుకుందాం’ అన్నారట. ఆ విధంగా, ఈ గ్రామం
‘దీపావళి’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది’’ అని వివరించారు శ్రీకాకుళానికి చెందిన ఏస్ (అగ్రి బిజినెస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఎన్జీఓ ఛైర్మన్, అగ్రి సైంటిస్ట్ డా.ఎస్.వి.ఎస్.ఆర్.కె నేతాజీ. సాధారణంగా సంక్రాంతి పండగకు అల్లుళ్లకు మర్యాదలు చేస్తారు. కానీ ఈ ఊరిలో మాత్రం ‘దీపావళి’కి కూడా అల్లుళ్లకు మర్యాదలు, ప్రత్యేక ఆచారాలు విందులు, వినోదాలు, కుటుంబ సమేతంగా భోజనాలు చేయడం, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సరదాలతో మహా సందడిగా ఉంటుంది.

రాజును తలుచుకుంటూ దీపాలు...
‘‘ఎవరైనా మీదే ఊరు అంటే... ‘దీపావళి’ అని చెప్పుకోవడం మాకు గర్వంగా ఉంటుంది. అప్పుడెప్పుడో రాజుగారు పేరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా... రెవెన్యూ రికార్డుల్లో మా గ్రామం ‘దీపావళి’గానే నమోదు అయింది. ఇక్కడ అన్ని పండుగలు ఘనంగా జరుపుకొంటారు. సంక్రాంతికి పెద్దలను తలుచుకుంటూ భోజనాలు పెట్టుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఉన్న సంప్రదాయం. మా ఊరిలో సంక్రాంతి పండుగతో పాటు దీపావళికి కూడా పెద్దలకు కొత్త దుస్తులు, భోజనాలు పెట్టడం విశేషం. ఇక్కడ పాడిపంటలకు లోటులేదు. వరి, జొన్నలు అన్ని రకాల కూరగాయలు పండించుకుంటాం. అయితే తాగునీటికి చాలా ఇబ్డందులు పడుతున్నాం. మాకు సమీపంలో శాలిగుండం తాగునీటి ప్రాజెక్టు ఉన్నప్పటికీ... మా గ్రామస్తులకు సరిపడా రక్షిత మంచినీరు అందటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది’ అంటున్నారు ‘దీపావళి’ గ్రామ సర్పంచ్ చల్ల శ్రీనివాసరావు. ఈయన గత 24 ఏళ్లుగా ఈ గ్రామానికి సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు.
పేరుకు తగ్గట్టే ‘దీపావళి’ సందర్భంగా గ్రామం మొత్తం రాత్రి సమయంలో వేల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రంగోలీ డిజైన్‌లతో వీధులు, ఇళ్లు కళకళలాడు తుంటాయి. ఊరి చరిత్రను, రాజును తలుచు కుంటూ దీపాల వెలుగులో ఊరేగింపు, శ్రీ కూర్మనాఽథ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. అందరికీ శుభాలు జరగాలని భక్తిశ్రద్ధలతో గ్రామస్తులంతా పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.
ఒక రాజు గొంతులో నీళ్లు పోసి కాపాడిన గొప్ప చరిత్ర ఈ గ్రామానిది. అలాంటి ప్రజల వారసులు ఇప్పుడు తాగునీటి సమస్యను ఎదుర్కోవడం విచిత్రం.
- శ్యాంమోహన్, 94405 95858