Share News

Tirumala: ప్రదర్శన కోసం పిలిచి మోసం చేశారు

ABN , Publish Date - Jun 28 , 2025 | 02:44 AM

తిరుమలలో నృత్య ప్రదర్శనకు అవకాశం ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కళాకారులు శుక్రవారం నిరసన తెలిపారు.

Tirumala: ప్రదర్శన కోసం పిలిచి మోసం చేశారు

  • తిరుమలలో నృత్య కళాకారుల నిరసన

తిరుమల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో నృత్య ప్రదర్శనకు అవకాశం ఇస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కళాకారులు శుక్రవారం నిరసన తెలిపారు. తిరుమల ఆస్థాన మండపం ముందు బైఠాయించారు. అన్నమాచార్య ఆర్ట్స్‌ అకాడమి, అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్‌ సంస్థలను తెలంగాణకు చెందిన అభిషేక్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ‘శ్రీశ్రీనివాస కళార్చన’ పేరుతో ఆస్థాన మండపంలో నృత్య ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తామంటూ ఆయన పిలుపునివ్వడంతో రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రచార పరిషత్‌(హెచ్‌డీపీపీ) ఈ నెల 21న ప్రదర్శనలకు అనుమతి కూడా ఇచ్చింది. అయితే కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలియడంతో టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశంలో వాటిని రద్దు చేశారు.


అభిషేక్‌ హైకోర్టును ఆశ్రయించడంతో, ముందుగా నిర్ణయించిన కార్యక్రమం అయినందున ప్రదర్శనలకు అనుమతివ్వాలని, ఆరోపణలపై విచారించి నెలలోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో 27, 28వ తేదీల్లో రోజుకు 600 మందికి చొప్పున 1,200 మందికి ప్రదర్శనలు ఇచ్చేందుకు టీటీడీ అనుమతినిచ్చింది. అయితే శుక్రవారం తిరుమల చేరుకున్న 600 మందికి పైగా కళాకారులు తిరుమలకు చేరుకోవడంతో విజిలెన్స్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వీరు నిరసనకు దిగారు. తమ దగ్గర నుంచి రూ.2 వేల నుంచి 4 వేల దాకా వసూలు చేశారని, తీరా పిల్లల్ని తీసుకుని తిరుమలకు వచ్చాక ప్రదర్శనకు అవకాశం లేదంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 28 , 2025 | 11:03 AM