Cyclone Montha: భద్రాచలం సమీపంలో వాయుగుండం.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:46 PM
రాష్ట్రంలో మొంథా తుపాను తీవ్ర రూపం దాల్చింది. గత రాత్రి కాకినాడకు దక్షిణంగా నరసాపూర్‌కు సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్యదిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి భద్రాచలం సమీపంలో కొనసాగుతుందని వెల్లడించింది.
అమరావతి, అక్టోబర్ 29: మొంథా తీవ్ర తుపాను గత రాత్రి కాకినాడకు దక్షిణంగా నరసాపూర్‌కు సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్యదిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆనుకొని భద్రాచలం సమీపంలో కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. బుధవారం భారీ వర్షాలు పడుతాయని ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
కోస్తా జిల్లాల్లో గంటకు 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్య్సకారులు ఈరోజు, రేపు చేపల వేటకు వెళ్లారాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో అన్ని పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu: మొంథా తుఫాన్ బాధితులకు రూ.3 వేలు ఆర్థిక సాయం
Lokesh Montha Cyclone Review: బాధితులకు సహాయం చేయండి.. నేతలకు మంత్రి లోకేష్ ఆదేశాలు