Share News

AP Govt: గుడ్ న్యూస్.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్..

ABN , Publish Date - May 04 , 2025 | 04:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో తొలి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్‌ల్యాండ్‌ ఆసియాతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించే భారీ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

AP Govt: గుడ్ న్యూస్.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్..

  • దేశంలోనే తొలి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ

  • 10 వేల కోట్ల పెట్టుబడులు.. 1.50 లక్షల ఉద్యోగాలు

  • క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియాతో ప్రభుత్వం ఒప్పందం

  • ముంబై వేవ్స్‌ సదస్సులో ఎంవోయూపై సంతకాలు

  • థీమ్‌ పార్క్‌లు, గ్లోబల్‌ సినిమా కో-ప్రొడక్షన్‌ జోన్‌లు

  • ఏఐ ఆధారిత వర్చువల్‌ స్టూడియో కాంప్లెక్స్‌ ఏర్పాటు

  • సినిమా, వినోద, పర్యాటక అభివృద్ధికి దోహదం

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని క్రియేటర్‌ల్యాండ్‌గా పిలుస్తారు. ముంబైలో జరుగుతున్న వేవ్స్‌ సదస్సు-2025లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, క్రియేటివ్‌ల్యాండ్‌ ఆసియా ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. శనివారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.


ఎంవోయూ ప్రకారం క్రియేటివ్‌ల్యాండ్‌ ఐదారేళ్లలో రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా. 1.50 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. మంత్రి దుర్గేశ్‌ ప్రస్తుతం వియత్నాంలో ఉండటంతో పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, క్రియేటివ్‌ల్యాండ్‌ స్టూడియోస్‌ వ్యవస్థాపకులు సాజన్‌రాజ్‌ కురుప్‌, హాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌ అడ్వైజరీ బోర్డు ప్రతినిధులు డేవిడ్‌ ఉంగర్‌, సీఈవో ఆర్టిస్ట్స్‌ ఇంటర్నేషనల్‌, గ్లోబల్‌ గేట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విలియం పైఫర్‌, నికోలస్‌ గ్రానాటినో చైర్మన్‌ నోవాక్వార్క్‌లు ఎంవోయూపై సంతకాలు చేశారు.


ఇటీవల క్రియేటివ్‌ల్యాండ్‌ ఆసియా ప్రతినిధులు అమరావతి సచివాలయంలో మంత్రి దుర్గేశ్‌ను కలిసి ఈ విషయంపై చర్చించారు. అప్పుడే మంత్రి సమక్షంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ ఏర్పాటుకు అంగీకరించారు. సందర్శకులు లీనమయ్యేలా థీమ్‌ పార్క్‌లు, గేమింగ్‌ జోన్‌లు, గ్లోబల్‌ సినిమా కో-ప్రొడక్షన్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్‌ల్యాండ్‌ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్‌ ఆధారిత వర్చువల్‌ స్టూడియో కాంప్లెక్స్‌కు రూపకల్పన చేస్తారు. ఏఐ, ఆర్‌ అండ్‌ డీ, వీఎ్‌ఫఎక్స్‌, గేమింగ్‌, వినోదం, టెక్‌, పర్యాటక రంగాల్లో 1.50 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముంది.


ఉద్యోగాల సృష్టి, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, డిజిటల్‌ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందని మంత్రి దుర్గేశ్‌ వివరించారు. క్రియేటివ్‌ల్యాండ్‌ ఆసియాతో భాగస్వామ్యం రాష్ట్రంలో చలనచిత్ర, వినోద పర్యాటకం అభివృద్ధికి మైలురాయి వంటిదని అన్నారు. క్రియేటర్‌ల్యాండ్‌ ఏర్పాటు చేస్తే ప్రపంచ స్థాయి ప్రొడక్షన్‌ హబ్‌ ద్వారా వినోదంతో పాటు ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని మంత్రి పేర్కొన్నారు. క్రియేటర్‌ల్యాండ్‌ ప్రాజెక్ట్‌ ఆవిష్కరణలతో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి తెలిపారు. ప్రపంచ సృజనాత్మక పటంలో ఏపీ కీర్తిని పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో తాము చేతులు కలపడం వినోదం, విద్య, ఆవిష్కరణల భవిష్యత్తుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియా వ్యవస్థాపకులు సాజన్‌రాజ్‌ కురుప్‌ అన్నారు.

Updated Date - May 04 , 2025 | 08:11 AM